మదనపల్లె టౌన్ : చికిత్సకు వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. కురబలకోట మండలం సర్కారు తోపునకు చెందిన సూరి(50) మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని రింగు రోడ్డులో గత 20 ఏళ్లుగా ఉంటున్నాడు. మతి స్థిమితం సరిగా లేక స్వగ్రామ మైన సర్కారు తోపు నుంచి మదనపల్లెకు వచ్చేశాడు. రింగు రోడ్డులో ఉంటూ ఎవరైనా ఏదయినా పని చెబితే చేసి వారు ఇచ్చే చిల్లరతో తిని గుడి, బడి, ఏదైనా వసారాల్లో నిద్దర పోయేవాడు. స్థానికులకు అందరికీ సూరి పేరుతో సుపరచితుడు. రోజూ అందరితో అభిమానంతో మాట్లాడే సూరికీ ఆరోగ్యం బాగ లేక పోవడంతో జాలితో రింగు రోడ్డులో ఉంటున్న సిద్దేశ్వర, రమణారెడ్డి తదితరులు తీసుకు వచ్చి వారం రోజుల క్రితం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి టూటౌన్ పోలీసులను ఆశ్రయించి మృతదేహం తీసుకెళ్లాలని సీఐ మహ్మద్ రఫీ తెలిపారు. మూడు రోజుల్లో తీసుకువెళ్లక పోతే మునిసిపాలిటీకి అప్పగిస్తామని తెలిపారు.


