వేర్వేరు ప్రాంతాల్లో ఈత సరదాతో ఇద్దరు ప్రాణం కోల్పోయారు. చౌడేపల్లె మండలం పొదలపల్లెలో గంగ జాతరకు బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు బావిలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ యర్రంరెడ్డిగారిపల్లెకు చెందిన ఓ బాలుడు చెక్‌డ్యాంలో మృత్యువాత పడ్డాడు.
చౌడేపల్లె : గ్రామంలో గంగ జాతర వేడుకకు బంధువులు ఆహ్వానించారు. బంధువుల ఇంటికి వచ్చిన అతను.. వేసవి తాపానికి సేద తీరడానికి ఈతకెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మంగళవారం పొదలపల్లె సమీపంలోని పంట పొలాల్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన ఎం.చంద్రశేఖర్‌రెడ్డి(37) అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం పొదలపల్లెలో బంధువుల ఇంటికి వచ్చాడు. చిట్రెడ్డిచెర్వు కింద గల గోపన్న బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడే ఈత ఆడుతున్న యువకులతో కలిసి అతను కూడా బావిలోకి దిగి ఈత కొడుతూ ఒక్కసారిగా మునిగిపోయాడు. గమనించిన సహచరులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న యువకులు, దిగి బావిలో వెతికినా ఫలితం లేకపోయింది. వెంటనే పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీం ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది సుబ్రమణ్యం, లోకేష్‌రెడ్డి, ప్రకాష్, ఆనంద్‌ల బృందం బావిలో పాతాళ బైరవి సహకారంతో గంట సేపు గాలించి శవాన్ని వెలికి తీశారు. జాతర రోజు పొదలపల్లెలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
బట్టలు ఉతకడానికి వెళ్లి..
ములకలచెరువు : తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి చెక్‌డ్యాం వద్దకు వెళ్లి ఈత ఆడుతూ ఓ బాలుడు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ యర్రంరెడ్డిగారిపల్లెకు చెందిన కె.వెంకటరమణారెడ్డి కుమారుడు కె.అభిషేక్(17) తన తల్లి లక్ష్మిదేవితో కలిసి ఊరికి దగ్గరలోనే చెక్‌డ్యాం వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈత ఆడటానికి చెక్‌డ్యాంలోకి దూకిన కె.అభిషేక్ నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గమనించిన తల్లి చుట్టు పక్కల వారికి కేకలు వేసి పిలవగా.. స్థానికులు చెక్‌డ్యాంలోకి దూకి బాలుడిని బయటికి తీసుకురాగా అప్పటికే మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి
మృతదేహం
మృతి చెందిన
కె.అభిషేక్
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి


