మదనపల్లె టౌన్ : ఆస్తి కోసం మాజీ భార్య, ఆమె భర్తను చంపాలని జరిపిన ప్రాణాంతక దాడి కేసులో ముగ్గురి నిందితులకు రెండేళ్ల జైలు శిక్షను మదనపల్లె ఏడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆర్.శ్రీలత మంగళవారం తీర్పును వెలువరించారు. ఇందుకు సంబంధించి అన్నమయ్య జల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సిబ్బంది తెలిపిన వివరాలు.. పుంగనూరుకు చెందిన ఎం.యోసు తన భార్య నీలిమాతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం చౌడేపల్లెకు చెందిన వెంకటేష్‌ను నీలిమ వివాహం చేసుకుని జీవిస్తోంది. అయితే నీలిమ తల్లి పేరున గుర్రంకొండ మండలంలో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని యోసు పథకం పన్నాడు. ఈ క్రమంలో నీలిమ, వెంకటేష్ దంపతులు 11 డిసెంబర్ 2022లో చౌడేపల్లె నుంచి పలమనేరుకు వెళుతుండగా నీలిమ మాజీ భర్త యోసు తన స్నేహితులు టి.నాగరాజు, ఎం.మునిరాజలతో కలసి వారిని దారిలో అటకాయించారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. వారి చేతిలో తీవ్రంగా గాయపడిన బాధిత దంపతులు తప్పించుకుని వచ్చి జరిగిన విషయాన్ని చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులు యోసు, నాగరాజు, మునిరాజలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు మదనపల్లె ఏడవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. కోర్టులో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆర్ శ్రీలత ఏ1 యోసు, ఏ2 నాగరాజ, ఏ3 మునిరాజలకు ఐపిసి సెక్షన్ 324 కింద రెండేళ్లు, సెక్షన్ 506 కింద ఒక ఏడాది, సెక్షన్ 341 కింద ఒక నెల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. ఈ కేసులో ఏపిపిగా శైలజ వ్యవహరించారని తెలిపారు.
ఇద్దరు మైనర్లు అరెస్ట్
వేంపల్లె : స్థానిక శ్లోక పాఠశాల సమీపంలోని జిమ్మి చెట్టు వద్ద ఉన్న ఇంట్లో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు బాలురలను అరెస్టు చేసి జువైనెల్ హాంకు తరలించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. గతనెల 28వ తేదీన వేంపల్లెలోని జిమ్మి చెట్టు వీధిలో నివాసముంటున్న అఖిల అనే మహిళ ఇంటికి తాళం వేసి డ్యూటికి వెళ్లింది. ఇంటి తలుపులను ఇనుప కడ్డీతో పగుల కొట్టి బీరువాలో ఉన్న బంగారు కమ్మలు, వెండి గజ్జలు దొంగలించారన్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను విచారించగా చోరీ చేసిన విషయం బయట పడినట్లు తెలిపారు.


