మదనపల్లె టౌన్ : వేసవి సెలవుల్లో ఊర్లు, విహార యాత్రలు వెళుతున్నారా? అయితే దొంగలతో జర జాగ్రత్తగా ఉండి, తమ ఆస్తులను రక్షించుకోవాని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు. మంగళవారం ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలను ఉద్దేశించి పలు కీలక సూచనలు జారీ చేశారు.
ఇల్లు భద్రంగా ఉండాలంటే..
ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ప్రధాన ద్వారంతోపాటు వెనక తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి వెళ్లాలన్నారు. ఫలాన ఊరు వెళుతున్నాం, ఇప్పుడు అక్కడ ఉన్నాం అంటూ ఫేస్ బుక్, వాట్సప్‌లలో ఫొటోలు వీడియోలు షేర్ చేస్తే దొంగలకు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని ఎస్పీ హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంట్లో, బయట లైట్లు వెలిగేలా చేయాలన్నారు. పక్కింటి వారు, నమ్మకస్తులకు సమాచారం ఇస్తే మన ఇంటిపై వారు నిఘా ఉంచుతారని తెలిపారు. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో ఉంచడం సేఫ్టి అన్నారు.
పిల్లల భద్రత తల్లిదండ్రులదే..
పరీక్షలు ముగిసి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు, తమ పిల్లల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన చెరువులు, బావులు, వాగులు, ఉధృతంగా పారే కాలువల్లో నది లోతు తెలియ కుండానే ఈతకు వెళ్లడం మంచిది కాదని.. జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తమ పిల్లలు ఎవరతో తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. కథల పుస్తకాలు, సమ్మర్ క్యాంపుల వైపు వారి దృష్టిని మరల్చి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు.
పోలీసులకు సహకరించాలి
జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులతో నిఘా పెంచామని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100, 112 కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు, ఓటిపి వంటి వివరాలు చెప్పద్దని సూచించారు. అలాగే హెల్మెట్ ధరించే ప్రయణాలు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.


