మదనపల్లె సిటీ : విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ దశల వారీగా ప్రైవేటు పరం చేయాలని చేస్తే ఆందోళనలు తప్పవని ఎంప్లాయీస్ యూనియన్ (ఏపీపీటీడీ) రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మదనపల్లె ఆర్టీసీ–1 డిపో ఆవరణలో జిల్లా అధ్యక్షులు ఎస్‌పి బాబు, ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఆ నిర్ణయాల వల్ల ఆర్టీసీ దశలవారీగా ప్రైవేటుపరం అవుతుందని, ఇది సరైన విధానం కాదని తేల్చిచెప్పారు. సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే మూడు వేల బస్సులను పెంచాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకం చేపట్టాలన్నారు. తనిఖీ అధికారులు రాసే అక్రమ కేసులపై పనిష్మెంట్ ఇచ్చే విధానాలు మానుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించి వెంటనే 12వ ీీపీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ అరకొర పాత బస్సులతో అధిక పనిభారాలతో డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెన్స్ సిబ్బంది పని ఒత్తిడితో నిబద్ధతగా పని చేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో సిబ్బందిపై దాడులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. సమావేశంలో జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్.ఖాన్, రాజశేఖర్, విజయకుఆమర్, పీఎన్‌బి రెడ్డి, విటి.నాథ్ తదితరులు పాల్గొన్నారు.


