● మదనపల్లె తహసీల్దార్ బదిలీ వేటుపై
తీవ్ర చర్చ
● బహిరంగం అవ్వని అటాచ్‌మెంట్ ఉత్తర్వు
మదనపల్లె : మదనపల్లె తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం రాజకీయ, అధికార వర్గాలతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన పై తీసుకున్న చర్యకు సంబంధించి ఆదివారం రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా విస్తత ప్రచారం జరిగింది. ఓ విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు కాపీ చక్కర్లు కొట్టింది. తహసిల్దార్ ను అటాచ్ చేసినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆ ఉత్తరం కాపీ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. అధికారులు జారీ చేసే ఉత్తర్వులు సాధారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తాయి. తహసిల్దార్ అటాచ్ కు సంబంధించిన ఉత్తర్వు మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అసలు అటాచ్ చర్యకు కారణం ఏమిటి అన్న విషయం ఆ ఉత్తర్వుల్లో ఉండే అవకాశం ఉంటుందన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. బహిర్గతం కాకపోవడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
విజిల్ బ్లోయర్ ఫిర్యాదు కారణమా..
విజిల్ బ్లోయర్ పేరుతో కలెక్టర్, సీసీఎల్‌ఏకు వెళ్లిన ఫిర్యాదు కిషోర్ కుమార్ రెడ్డి పై చర్యకు కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఓ భూమికి సంబంధించి ఓ వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.10 లక్షలు చెల్లించేలా ఓ వీఆర్‌ఓ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింధన్నది అందులోని ఫిర్యాదు. ఇందులో రూ.5 లక్షలను తహసిల్దారు చెప్పిన అకౌంట్ కు జమ చేసినట్టు, ఆ రసీదు ఫిర్యాదుకు జత చేయబడి ఉంది. ఈ ఫిర్యాదు ఈనెల రెండున చేశారు. ఇదే కాక మరికొన్ని ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. ఈ ఫిర్యాదు చేసిన విజిల్ బ్లోయర్ తక్షణమే తహసిల్దార్ ను సస్పెండ్ చేయాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని అందులో కోరారు.
ముందు ఎమ్మెల్యే ఫిర్యాదు
మదనపల్లె తహసీల్దార్ పై మార్చి 8, 10 తేదీల్లో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బసినికొండ, వేంపల్లి గ్రామాలకు సంబంధించిన భూముల వ్యవహారంలో తహసిల్దార్, వీఆర్వోలు అవినీతికి పాల్పడ్డారని, రికార్డులు తారుమారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా సబ్ కలెక్టర్ విచారణ చేయగా, ఈ విచారణలో ఏమీ తేలిందో అధికారులకు తప్ప ఎవరికి తెలియదు. కాగా తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి అటాచ్మెంట్ వ్యవహారంపై ఎమ్మెల్యే సోమవారం మీడియాతో మాట్లాడుతూ కిషోర్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈయన అవినీతిపై సిఐడి విచారణ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు.
ఆ రెండు కారణమేనా?
తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని మదనపల్లి నుంచి తప్పిస్తూ కలెక్టరేట్ కు అటాచ్మెంట్ చేయడం వెనక తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాజకీయాలు కారణమై ఉంటాయని చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇక్కడి ఎవరు పనిచేసిన అవినీతి ఆరోపణలను మూట కట్టుకోవాల్సిందే. రాజకీయ అండ ఉన్నా లేకున్నా ఏదో ఒక తప్పుడు వ్యవహారంలో చిక్కుకోక తప్పదు. కిషోర్ కుమార్ రెడ్డికి ఇలాంటి వ్యవహారం ఏదో మెడకు చుట్టుకుని ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే రాజకీయ కోణంలో చూస్తే తమకు రెవెన్యూ వ్యవహారాల్లో ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో చర్యలకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేసే అవకాశం లేకపోలేదు. అవినీతి ఆరోపణలను తెరపైకి తేవడం ద్వారా తహసీల్దార్ పై వేటుకు వ్యూహం పన్ని ఉండవచ్చు. ఎందుకంటే విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు బహిరంగం కావడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో అటాచ్మెంట్ జరిగిన దానికి సంబంధించిన ఉత్తర్వు మాత్రం బహిరంగం కాలేదు. ఈ చర్యకు ఎమ్మెల్యే ఫిర్యాదు విచారణలో వాస్తవాలు తేలి ఉంటే చర్యలు తీసుకున్నారా లేక విజిల్ బ్లోయర్ ఫిర్యాదు ఆధారంగా విచారించి చర్యలు తీసుకున్నారా అన్నది స్పష్టంగా తెలియదు.


