కేవీపల్లె : అగ్నిప్రమాదంలో కొబ్బరి, మామిడి చెట్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వగళ్ల పంచాయతీ గంటావారిపల్లెలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలిలావున్నాయి. గంటావారిపల్లెకు చెందిన పూజారి శంకర పీలేరులో నివాసం ఉంటున్నాడు. సొంత గ్రామంలో తన భూమిలో కొబ్బరి, మామిడి చెట్లు సాగు చేశాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో కంచెకు నిప్పు పెట్టడంతో కొబ్బరి, మామిడి చెట్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 25 కొబ్బరి, 20 మామిడి చెట్లు తోపాటు పీవీసీ పైపులు, డ్రిప్, స్ప్రింక్లర్ పైపులు కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు.
కారు ఢీకొని వృద్ధుడికి
తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చౌడేపల్లె మండలంలో జరిగింది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు..మండలంలోని చారాలకు చెందిన కె.చెంగప్ప(65) రోడ్డుపై నడచి వెళుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలం వద్దకు వెళ్లి బాధితున్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నునటు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు.
పల్సర్ మోటార్ బైకు దగ్ధం
వేంపల్లె : పులివెందుల రోడ్డు నుండి గండికి వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ట్యాంకు నుంచి పెట్రోలు లీకై పల్సర్ బైకు దగ్ధమైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాలు. వేంపల్లె మేదర వీధికి చెందిన కమల్‌బాషా అనే వ్యక్తి గండి బైపాస్ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో జరిగే వివాహానికి బైకులో వెళ్లాడు. ఆదివారం రాత్రి 2గంటల సమయంలో బైక్ యజమాని కమల్‌బాషా స్నేహితుడు మహమ్మద్ బైకును తీసుకుని స్పీడ్‌గా వెళ్లడంతో బైక్ నుంచి పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మహమ్మద్ అనే వ్యక్తి భయపడి బైకును అక్కడ పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో మంటలు ఎగసిపడి పూర్తిగా ఏపీ39సీహెచ్ 1934 నంబరు గల పల్సర్ బైకు పూర్తిగా కాలిపోయిందని సీఐ నరసింహులు తెలిపారు.
మహిళ అనుమానాస్పద మృతి
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లెలో ఓ మహిళ మృతి అనుమానాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన యంబడిశ్యామల (47) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందింది.గ్రామస్తుల సమాచారం మేరకు మృతికి ముందు రోజు రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగినట్లు తెలిసింది.దీంతో గ్రామస్తులు శ్యామల బంధువులకు సమాచారం ఇచ్చారు. శనివారం వారు వచ్చి చూసేటప్పటికీ మంచం పడి ఉందిం. ఎంతసేపటికీ లేవకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఆమె మృతి చెందినట్లు నిర్దారించుకుని అదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. శ్యామల మృతిపై విచారణ చేయాలని పుల్లారెడ్డిపల్లె వీఆర్‌ఓ వెంకటసుబ్బమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కలసపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


