శివాలయంలో అవినీతి విచారణలో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

శివాలయంలో అవినీతి విచారణలో హైడ్రామా

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి (శివాలయం) ఆలయంలో జరిగిన అవినీతిపై సోమవారం చేపట్టిన విచారణ రసాభాసగా జరిగింది. అవినీతిపై ఆలయ చైర్మన్‌ వంగల నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు దేవదాయశాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదేశాల మేరకు ఆరుగురితో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యుల్లో ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌కుమార్‌రెడ్డి, మదనపల్లె ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, తిరుపతి ఇన్‌స్పెక్టర్‌ ఫణిరాజశయనలు విచారణకు హాజరయ్యారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్‌ ఈ విచారణపై అభ్యంతరం తెలిపారు. అధికారులకు ఆయన ఆధారాలు అందించారు. బంగారు హారం, వెండి ఆభరణాలు మాయమైనా సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళి, అల్లం చంద్రశేఖర్‌, బీజేపీ పట్టణాధ్యక్షుడు వంకదారి నరేంద్రరావు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆలయంలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో దేవదాయశాఖ అధికారులు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఉత్సవాల పేరుతో నిధులు స్వాహా చేశారని గణపతి మహోత్సవ కమిటీ ప్రతినిధులు మారెళ్ల మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం, చంద్రగుప్తా, సేతురావు అధికారులకు తెలిపారు. గత ఐదేళ్లలో గణపతి మహోత్సవ కమిటీ పేరుతో రూ.2.80 లక్షలు స్వాహా చేశారన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై పలువురు భక్తులు తన దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై విచారించగా బంగారు హారం, 290 గ్రాముల వెండి ఆభరణాలు మాయమయ్యాయని, బంగారు హారం రికవరీ జరిగిందన్నారు. అయితే వెండి వస్తువులు ఇంత వరకు రికవరీ కాలేదన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ శివప్రసాద్‌ ఉన్నతాధికారులతో కలసి పలు చెక్కుల ద్వారా దాదాపు రూ.కోటి నిధులు దుర్వినియోగం, స్వాహా చేశారని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం విచారణ చేయనున్నట్లు చెప్పారు. విచారణలో ఆలయ ఈఓ రమణ, అర్చకులు భక్తులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

విచారణకు ముగ్గురు కమిటీ సభ్యులు

గైర్హాజరు

Advertisement
 
Advertisement
Advertisement