మహిళలను కించపరచడం నీచమైన చర్య | - | Sakshi
Sakshi News home page

మహిళలను కించపరచడం నీచమైన చర్య

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

బద్వేలు అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారం చేసిన చర్చలో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్‌జీవో కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఏబీఎన్‌ ఛానల్‌ ఎండీ రాధాకృష్ణ ద్వారా వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులపై ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సిద్దాంతపరమైన విభేధాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ ఒక రాజకీయ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. జర్నలిజం అనేది సమాజానికి దిశా నిర్ధేశం చేసే ఒక పవిత్రమైన వృత్తి అని, ఒక ఛానల్‌ ఎండీగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇతరుల వ్యక్తిగత జీవితాలను, మహిళల గౌరవాన్ని కించపరచడం ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణకు తగదని అన్నారు. తక్షణమే ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ

Advertisement
 
Advertisement
Advertisement