కుక్కల నివాసమా! | - | Sakshi
Sakshi News home page

కుక్కల నివాసమా!

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

పర్యాటక కేంద్రమా.. కుక్కల నివాసమా!

వన్యప్రాణులపై దాడులు

పర్యాటక కేంద్రమా..

హార్సిలీ హిల్స్‌ రోడ్డుపై కుక్కల స్వైర విహారం

బి.కొత్తకోట: రాష్ట్రంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ గ్రామ సింహాలకు నివాసంగా మారిపోయింది. అందం, ఆహ్లదంతో పర్యాటకులను అలరిస్తున్న చల్లని కొండపై ఈ గ్రామసింహాలు చేస్తున్న అలజడి అంతాఇంతా కాదు. కొన్నినెలల క్రితం ఒకటో రెండో కనిపిస్తుండగా ఇప్పుడు పదులసంఖ్యలో జనంతో పోటీపడి గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి సంఖ్య స్థానిక జనాభాతో పోటీపడుతూ సందర్శకులను హాడలెత్తిస్తున్నాయి. కొండపై ఇక్కడా అక్కడా అనికాదు ప్రతిచోట ఇవి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. సందర్శకులు సంచరించే ప్రతిచోట ఇవి కనిపిస్తున్నాయి. ప్రకృతి సందర్శనా ప్రాంతాలైన అన్నిచోట్ల సందర్శకులు నడిచి వెళ్లేటప్పుడు వారివెంట పడుతూ దాడి చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తున్నారు. గాలిబండ, ప్రధాన రహదారి, అతిథి గృహాలు, అటవీశాఖ పర్యావరణ సముదాయం, మానస సరోవరం, అటవీశాఖ అతిథి గృహాలు, పార్కులు..ఇలా అన్నిచోట్ల కుక్కలు గుంపులు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు వీటివల్ల భయపడుతున్నారు. కాగా సాయంత్రం వేళల్లో కుక్కల అరుపులతో పర్యాటకులకు ప్రశాంతత కరువైంది. బిగ్గరగా అరుస్తున్న కుక్కల శబ్దాలతో సాయంత్రం వేళల్లో సందర్శకులు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారు. సందర్శకులు ఎటు వెళ్తే అటుగా వారిపై పడుతున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌ పై చల్లదనం మాట దెవుడెరుగు కాని, ఇప్పుడు కుక్కలకు నివాసంగా మారిపోయింది.

పొరుగున పరువుపోతోంది

ఆహ్లాదకరమైన వాతావరణంలో పకృతి అందాలను తిలకించేందుకు, నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారులు, కుటుంబాలతో వచ్చేందుకు ఇష్టపడే అతిథులు ఇక్కడికి వచ్చేందుకు వణికిపోతున్నారు. ఇక్కడ సేద తీరేందుకు వస్తున్న పర్యాటకులు కుక్కల కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధిక మంది ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరు ఇక్కడ అతిథి గృహాల్లో బసచేస్తున్నారు. పగలంతా కుక్కల హడావుడి, సందర్శకులపైకి దాడికి దిగడం. భయభ్రాంతులకు గురిచేయడంలాంటి ఘటనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రివేళ అయితే ఇక నిద్ర పోవాల్సిన పనిలేదు. కుక్కల అరుపులతో నిద్రపోని పరిస్థితి నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు ఈ కుక్కల సంచారం, వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పెదవి విరుస్తున్నారు. దీని కారణంగా పర్యాటక కేంద్రానికి ఉన్న పేరు దెబ్బతింటోంది. ఇక్కడికి వచ్చి వెళ్లిన సందర్శకులు ఈ కుక్కల బెడద గురించి చెప్పుకునే పరిస్థితి నెలకొంది.

స్పందన లేని యంత్రాంగం

హార్సిలీహిల్స్‌ పైకి ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రభుత్వస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వచ్చిపోతూ, ఇక్కడ విడది చేస్తుంటారు. అయితే ఇక్కడి పరిస్థితులపై పట్టించుకోకపోవడంతో ఈ కుక్కల సమస్యకు పరిష్కారం లేకపోయింది. స్థానిక అధికారులు, టౌన్‌షిప్‌కమిటి కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కలను పట్టి ఇక్కడనుంచి తరలించాలని కోరుతున్నారు.

హార్సిలీహిల్స్‌పై గ్రామ సింహాలస్వైర విహారం

రాత్రివేళ భీకర అరుపులతోఉలిక్కిపడుతున్న అతిథులు

రోడ్లపై నడవాలంటే భయం

15రోజుల క్రితం దుప్పిపై కుక్కల దాడి

బెదిరిపోతున్న పర్యాటకులు

హార్సిలీహిల్స్‌ చుట్టూ దట్టమైన అటవీప్రాంతం ఉంది. కుక్కులు అధికం కావడంతో ఘాట్‌రోడ్డుపైన, అడవిలో వీటి సంచారం అధికమైంది. వన్యప్రాణులు కనిపిస్తే వాటిపై దాడి చేస్తున్నాయి. కొంతకాలం కిత్రం వరకు కుందేళ్లు, జింకలు రోడ్లపై యధేచ్చగా సంచరిస్తూ కనిపించేవి. ప్రస్తుతం కనిపించడం లేదు. 15రోజుల క్రితం కుక్కలు ఓ దుప్పిని చుట్టుముట్టి దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఎత్తులో ఉండి, పరిగెత్తే దుప్పిలాంటి వన్యప్రాణిపైనే దాడి చేశాయంటే ఇక చిన్నచిన్న వాటిపై కుక్కల దాడి ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కుక్కల బారినుంచి వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement