● పీకెఎం ఉడా పరిధిలో క్షేత్రస్థాయిలో
పరిశీలిస్తున్న అధికారులు
● నివేదిక సిద్ధం చేశాక చర్యలు
మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా పనిచేస్తున్న పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) అక్రమ లేఔట్లపై దృష్టి సారించింది. దీని పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో బి.కొత్తకోట నగర పంచాయతీ, సెలక్షన్ గ్రేట్ మదనపల్లె మున్సిపాలిటీ, పుంగనూరు, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలు, 18 మండలాలు ఉన్నాయి. వీటిలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా, లేఔవుట్ వేయాలన్నా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నిబంధన మేరకు ఉన్న విస్తీర్ణం నుంచి పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన నిర్మాణాలకు పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలి. అయితే ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. సంస్థ ఉందన్న విషయాన్ని కూడా ఎవరు గుర్తించడం లేదు. స్థానికంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో వాటి పరిధికి సంబంధించిన విస్తీర్ణ నిర్మాణ అనుమతి ఎంతుందో ఆ మేరకు మాత్రమే చూపించి అనుమతులు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పట్టణాభివృద్ధి సంస్థ వరకు అనుమతుల కోసం దరఖాస్తులు రావడం లేదు. అలాగే కోట్ల విలువైన లేఔట్లు వేసిన రియల్టర్లు కూడా అనుమతి పొందేందుకు సుముఖత చూపడం లేదు. లేఒట్లు వేసేసి ప్లాట్లను విక్రయించుకుంటున్నారు. దాంతో సంస్థ ఆదాయం లేకుండా పోయింది. దీనికి చైర్మన్ గా రాజకీయ నాయకుడు బిఆర్.సురేష్ బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు.
క్షేత్రస్థాయిలో లెక్క
ఐదు నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయన్న అంశంపై సంస్థ అధికారులు పరిశీలనలను చేపట్టారు. ఒక్కో నియోజకవర్గంలో అనుమతిలేని లేఔవుట్లు ఎన్ని ఉన్నాయి, అనుమతి పొందని వాణిజ్యపరమైన సంస్థలు ఎన్ని ఉన్నాయన్నవాటిని గుర్తించి నివేదికను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజులుగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ పరిశీలన పూర్తికానుంది. తర్వాత అక్రమ లేఔవుట్లు, నిర్మాణాలను గుర్తించి లెక్క తేల్చనున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధంచేసి తదుపరి చర్యలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీం అమలు చేస్తున్నప్పటికీ అక్రమంగా లేఅవుట్లు వేసిన వారు స్పందించడం లేదు. వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారంతో అక్రమ లేఔవుట్లు వెలుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
మున్సిపల్ శివారుల్లో..
పట్టణాల పరిధిలో రియల్టర్లు లేఔవుట్లు వేసే అవకాశం లేదు. అందుకు ఎకరాల భూమి అందుబాటులో ఉండదు. కాబట్టి మున్సిపల్ శివారు ప్రాంతాల్లో లేదా కొంత దూరంలో లేఔట్ల ఏర్పాట్లు జరుగుతోంది. ఈ లేఔట్లు పంచాయతీల పరిధిలోకి వెళుతున్నాయి. దాంతో పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి చర్యలు ఉండకపోవడంతో ఈ విషయం పట్టణాభివృద్ధి సంస్థ దృష్టికి రావడం లేదు. కొంతకాలం మండలాల పరిధిలో లేఔట్లు, అనుమతి లేని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వారి నుంచి ఇలాంటి సమాచారం అందలేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో సంస్థ అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టడంతో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా తేలిపోనుంది. ఆ తర్వాత పట్టణాభివృద్ధి సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.


