ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రాముడి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానం కన్నులపండువగా సాగింది. తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు యజ్ఞంలా జరిగాయి. లక్షల మంది భక్తులు తరలివచ్చి జగదభిరాముడిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తుల సర్వదర్శనానికి అనుమతిచ్చారు. సీతారామలక్ష్మణ దివ్య మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. 9:30 గంటలకు సుదర్శన చక్రత్తాశ్వర్ పల్లకిలో ఆలయం ఎదురుగా నిర్మించిన నూతన పుష్కరిణికి శోభాయాత్ర ప్రారంభమైంది. 9:30 నుంచి 10:30 గంటల వరకు సీతారామలక్ష్మ ణ ఉత్సవ మూర్తులకు ఉత్సవ కంకదారు రాజేష్ ఆధ్వర్యంలో స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల సరసన చక్రత్తాళ్వార్‌కు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకాలు చేశారు. 10:30 నుంచి 11:00 గంటల వరకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణతో చక్రస్నాన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, కళాకారులు, భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరిణి నుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం అధికారులు డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్‌ఐ హారిక వేదపండితులు, అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
ఏకశిలానగరి కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తొమ్మిదో రోజు శనివారం రాత్రి రుత్వికులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి పూజా సామగ్రిని సమర్పించారు. ఈ సందర్భంగా కంకణదారు రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో యాగశాలలో హోమాలు నిర్వహించారు. ధ్వజావరోహణంలో ధ్వజ స్థంభం పై నుంచి గరుడ పతకాన్ని కిందికి దించారు. కలశాలను కోదండ రామయ్యకు సమర్పించారు. ఆదివారం సాయంత్రం 6 నుంచి పుష్పయాగం జరుగుతుంది.


