సూక్ష్మ నీటి పారుదలకు రూ.71.15 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మ నీటి పారుదలకు రూ.71.15 కోట్లు

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

సూక్ష్మ నీటి పారుదలకు రూ.71.15 కోట్లు జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

మదనపల్లె: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి సూక్ష్మనీటి పారుదలశాఖ ద్వారా రూ.71.15 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారి లక్ష్మీ ప్రసన్న చెప్పారు. శనివారం ఆమె మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా బిందు, తుంపర సేద్య పరికరాలను 7691 మంది, 8622.82 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికోసం రూ.71.15కోట్ల సబ్సిడీ మంజూరు చేయగా, రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని చెప్పారు. బిందు, తుంపర సేద్య పద్దతుల ద్వారా సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సుమారు 40–50 శాతం వరకు నీటి ఆదా అవుతుందని, ఎరువుల వినియోగ సామర్థ్యం 30–50 శాతం తగ్గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మరింత విస్తృతంగా లక్ష్యాలను అమలు చేయనున్నట్టు చెప్పారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆర్‌.రామచంద్రారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.

గాలివీడు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన గాలివీడు పీహెచ్‌సీని తనిఖీ చేసి పలు లోపాలను గుర్తించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, వైద్య సేవల పనితీరు, మందుల నిల్వలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో హాజరు పట్టిక సక్రమంగా నిర్వహించకపోవడం,పలువురు సిబ్బంది గైర్హాజరు కావడం గమనించిన కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రసూతి గది (లేబర్‌ రూమ్‌) పరిశీలనలో అత్యవసర మందులు సక్రమంగా నిల్వ చేయకపోవడం, అవసరమైన ఔషధాల ట్రేలను ప్రొటోకాల్‌కు అనుగుణంగా నిర్వహించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అలాగే డ్రగ్‌ స్టోర్‌లో మందుల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించి, స్టాక్‌ రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement