వాల్మీకిపురాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

వాల్మీకిపురాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

వాల్మీకిపురం : గొప్ప చారిత్రక నేపథ్యం రాజకీయ చరిత్ర కలిగిన వాల్మీకిపురాన్ని తిరిగి నియోజకవర్గ కేంద్రంగా పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి నియోజకవర్గ కేంద్రంగా వాయల్పాడు ఉందని, 1986 ప్రాంతంలోనే రెవెన్యూ పరిపాలన పరంగా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, తాలూకా కార్యాలయాలు చంద్రగిరి వరకు విస్తరించి సేవలు అందించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. 120 సంవత్సరాల ముందు నుంచే రైళ్ల రాకపోకలు జరిగాయన్నారు. ఐదు దశాబ్దాల పాటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వాల్మీకిపురం 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో కనుమరుగైందన్నారు. నియోజకవర్గ కేంద్రం నుంచి మండల కేంద్రంగా నిలిచిపోవడం దురదృష్టకరమన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రానికి వాల్మీకిపురం 20 కిలోమీటర్లకులోపే ఉందని, నేషనల్‌ హైవేకు అత్యంత దగ్గరగా ఉందన్నారు. దీనిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని డీలిమిటేషన్‌ కమిటీనీ కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాల్మీకిపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోయాయన్నారు. నియోజకవర్గ కేంద్రంగా వాల్మీకిపురాన్ని తిరిగి పునరుద్ధరించాలని, త్వరలో జరగబోయే నియోజకవర్గాల విభజనను డీలిమిటేషన్‌ పరిశీలించి, నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోందన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో సహా డీలిమిటేషన్‌ కమిటీకి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు పాల్గొని, వాల్మీకిపురాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నీళ్లభాస్కర్‌, కేశవ రెడ్డి, శ్రీధర్‌రాయల్‌, ఇబ్రహిం, శివారెడ్డి, రవీంద్ర రెడ్డి, గంగిరెడ్డి, అశోక్‌ కుమార్‌ రెడ్డి, రవి, ఎల్‌.వి రమణ, యల్లప్ప, మునిభాస్కర, చలపతి, రఘు, రాజబాబు, విశ్వనాథ, శ్రీనివాసులు శెట్టి, శివ, అషర్‌, వెంకటస్వామి, హరి, సుధాకర, సదాశివ కుమార్‌, షాహెద్‌, రామక్రిష్ణారెడ్డి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement