వైఎస్సార్‌సీపీ కంచుకోట చూసి వణుకు!
‘చందమామ రావే.. జాబిల్లి రావే అని పిల్లలకు కథలు చెప్పినట్లు.. ఎన్నికలు రావు.. నోటిఫికేషన్ రాదు అంటూ కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఊరూరా తిరుగుతూ అసాధ్యమైన హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎన్నియల్లో ఎన్నికల్లో చంద్రంమామా.. అంటూ ప్రజలు ఆటపట్టిస్తున్నారు‘
బద్వేలు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్‌కు ఇప్పుడు ’స్థానిక’ సెగ తగులుతోంది. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపి, అధికారం చేపట్టాక ప్రజల గొంతు కోసిన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలను ఇప్పటికే అటకెక్కించిన సర్కార్, ఇప్పుడు పంచాయతీల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైంది. జనం తిరగబడతారని, ఘోర పరాభవం తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో.. ఎన్నికల ఊసే ఎత్తకుండా ప్రత్యేకాధికారుల పాలనను రుద్దేందుకు కుతంత్రాలు పన్నుతోంది.
దోపిడీ పర్వం.. పడగ విప్పిన పచ్చదండు!
అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమిలోని చోటా మోటా నాయకులు ’అందినకాడికి దోచుకో.. అడ్డంగా పంచుకో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకలు ఇసుక మాఫియా పరం కాగా, కొండలు, గుట్టలను సైతం కంకర రూపంలో కరిగించేస్తున్నారు. గ్రామకంఠం భూములను పచ్చ నేతలు కబ్జా చేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్నారని మహిళా లోకం నిప్పులు చెరుగుతోంది.
నిధులపై కన్నేసి.. సర్పంచ్‌లను ముంచేసి!
పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక పెద్ద కుట్రే ఉంది. పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను కాజేసేందుకే ఈ వాయిదా పర్వమని తెలుస్తోంది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియగానే, తహసీల్దార్లు, ఎంపీడీఓల వంటి ప్రత్యేకాధికారులను నియమించి.. వారి ద్వారా ఆ నిధులను తమ అనుయాయులకు, పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు.
కూటమి అడ్రస్ గల్లంతు తప్పదు
‘ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా కూటమి అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం. రెండేళ్లుగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు.
–బాల అంకిరెడ్డి, ఇ.రామాపురం, కలసపాడు
ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది
‘కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ప్రత్యేకాధికారులతో పాలన సాగించాలని చూస్తున్నారు. –జి. హనుమంతరెడ్డి, కాశినాయన మండలం.
నిధుల దోపిడీ కోసమే వాయిదా పన్నాగం
‘పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను దోచుకోవడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకాధికారుల ద్వారా ఆ డబ్బును టిడిపి కార్యకర్తలకు పంచిపెట్టేందుకు కుతంత్రం పన్నుతున్నారు. –రామకృష్ణారెడ్డి, బి.కోడూరు మండలం
వైఎస్సార్ కడప జిల్లాలో దాదాపు 95 శాతం పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ బలాన్ని తట్టుకోలేక, ప్రజాబలంతో గెలవడం అసాధ్యమని భావించే.. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా అంటూ కుంటి సాకులు వెతుకుతున్నారు. పీకల్లోతు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికే ఈ ’వాయిదా’ డ్రామా ఆడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు.
ఎన్నికలంటేనే ‘ఎల్లో గ్యాంగ్’కు వణుకు
జనం తిరగబడతారనే’స్థానిక’ వాయిదా!
నమ్మించి గొంతు కోసిన కూటమి సర్కార్‌పై కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్‌ల గడువు..ఊసేలేని నోటిఫికేషన్!
నిధుల దోపిడీ కోసమే పక్కా స్కెచ్..


