మదనపల్లెటౌన్: శాంతియుత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకోవాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలను స్వరించుకుంటూ ధర్మం, న్యాయం, ప్రేమ ఆయన జీవితంలో ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.వాటిని మన జీవితాల్లో కూడా ఆచరించాలని సూచించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా డీజే లాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. మై నర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదుచేయాలని పోలీసులకు ఎస్పీ ఆదేశించారు.
మదనపల్లెటౌన్: మదనపల్లె రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కోదండరాంను బ్లాక్ మెయిల్ చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన పెన్ పవర్ విలేకరి దొరస్వామిపై పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం మేరకు.. కోదండరాం మదనపల్లె సబ్ రిజిస్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ ల్యాండ్ రిజిస్టర్ విషయంలో గోల్ మాల్ జరిగిందని, చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరి దొరస్వామి మదనపల్లెకు వచ్చి సదరు సబ్ రిజిస్టర్‌ను రిజిస్టర్ జరిగిన ల్యాండ్ వివరాలు అడిగినట్లు తెలిసింది. వార్త రాకుండా ఉండాలంటే రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన కోదండరాం స్థానిక ఒకటవ పట్టణ పోలీసులను ఆశ్రయించి రాత్రి రిపోర్టర్లపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన వన్‌టౌన్ పోలీసులు దొరస్వామిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీలేరురూరల్: అన్నమయ్య జిల్లాలో రోజుకు ఆర్టీసీ ఆదాయం రూ. 90 లక్షలు వస్తోందని డీపీటీఓ రాము అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 490 బస్సులను 1.91 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నట్లు తెలిపారు. అందులో ఆన్‌కాల్ డ్రైవర్స్ అన్నమయ్య జిల్లాలో 319 మంది, చిత్తూరు జిల్లాలో 178 మంది పని చేస్తున్నారని చెప్పారు. మహాశిరాత్రి ఉత్సవాల్లో భాగంగా పీలేరు డిపో పరిధిలో తలకోన శివరాత్రి స్పెషల్ కార్యక్రమంలో అత్యధిక ఈపీకే సాధించిన సిబ్బందికి ప్రశంశాపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో రూ. 18 లక్షలు ఆదాయం సాధించిన సిబ్బందిని అభినందనలు తెలిపారు.


