ప్రమాదంలో గాయపడిన వారు
బి.కొత్తకోట: హార్సిలీ హిల్స్ మూడో మలుపులో ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది.టాటా ఏస్ వాహనం బోల్తాపడటంతో ముగ్గురు గాయపడ్డారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు. మదనపల్లె ఎస్టేట్ కు చెందిన 10 మంది బంధువులు టాటా ఏస్ వాహనంలో హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు. కొండపై సేదతీరి సాయంత్రం వెనుతిరిగారు. కొండనుంచి కిందికి వస్తుండగా ప్రమాదాలకు నిలయమైన ప్రొద్దుటూరు మలుపుగా పిలిచే అత్యంత క్లిష్టమైన మూడో మలుపు తిరుగుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులోని పర్యాటకులు కేకలు వేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కాండ్లమడుగు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. వాహనంలో నుంచి సందర్శకులను బయటకు తీశారు. వారిలో అస్మత్ బీ(52) తలకు, యాసీన్ (15), నజీర్ (40)కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు, గ్రామస్తులు మరో వాహనంలో పర్యాటకులను మదనపల్లెకు తరలించారు.
● మూడో మలుపు వద్ద అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. అందువల్ల ఈ మలుపు వద్ద బలమైన ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ వాహనాలు అదుపుతప్పినా లోయలోకి పడకుండా ఇది రక్షిస్తుంది. గతంలో ఇక్కడ వాహనాలు మలుపు తిరగలేక నేరుగా లోయలోకి పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చోట జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మూడో మలుపులో బోల్తాపడినటాటా ఏస్
ముగ్గురికి గాయాలు


