రోజురోజుకు పశుపోషణ భారంగా మారుతోందని పాడిరైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్ ఏర్పడడంతో వైఎస్సార్, తిరుపతి జిల్లాల నుంచి ప్రతిరోజు ఎండుగడ్డిని దిగుమతి చేసుకొంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు 7.128 టన్నుల గడ్డి అవసరం ఉంది. ఇందుకోసం పాడిరైతులు రూ 8.52కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నారు. పచ్చిగడ్డికి తోడుగా వరిగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని రైతుల నమ్మకం. దీంతో పచ్చిగడ్డి ఉన్నా ఎండు వరిగడ్డి, వేరుశనగ పొట్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలరోజుల క్రితం కిలో ఎండు వరిగడ్డి రూ. 5 ఉండేది. ప్రస్తుతం దళారులు ధరలు విపరీతంగా పెంచేసి రూ. 8 నుంచి రూ.10 వరకు పాడిరైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. రెండున్నర సెంట్ల పొలంలో ఉన్న మొక్కజొన్నలూ రూ. 2వేలకు, జొన్నలు రూ.1000, వేరుశనగ పొట్టు లోడు రు.25 వేల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.దీనికి తోడు ఫీడ్ దరలు రోజు రోజుకు ఆకాశనంటుతున్నాయి.


