● ఆ ఊర్లకు ఒకే తాగునీటి బోరు
● నీళ్లు వదిలే విషయమై వివాదం
● శత్రువులుగా మారిన బంధువులు
● పరస్పర దాడులు.. నెలకొన్న ఉద్రిక్తత
కురబలకోట : బంధుత్వం మరచి తాగునీటి కోసం తగవులు పడ్డారు. ఒకప్పుడు ఆప్యాయంగా మసలుకున్న వారు పట్టుదలకు పోయి నీటి కోసం పరస్పరం శత్రువులుగా మారారు. కోపతాపాలతో రగిలిపోయారు. రక్త సంబంధం కన్నా తాగునీటి సమస్యే పెద్దదయింది. రెండు గ్రామాలకు ఒకే తాగునీటి బోరు.. నీటి సరఫరా విషయమై పరస్పర ఘర్షణలతోపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తాగునీరు సక్రమంగా వదల లేదన్న కారణంగా తలెత్తిన వివాదం ఒక గ్రామం వారిపై మరో గ్రామం వారు దాడి చేశారు. రెండు గ్రామాలకు ఒకే బోరు ద్వారా నీటి వినియోగంపై వివాదం ముదిరి దాడులకు, పైపులైన్ ధ్వంసానికి దారితీసింది. ఆదివారం సీపీఐ నాయకులు సాంబశివ, మాధవ ఆ గ్రామాన్ని సందర్శించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిచ్చలవాండ్లపల్లి గ్రామం లక్కసముద్రం ప్రాంతంలో ఎర్రజేనువారిపల్లి, బోడికుంట్లపల్లి ఉన్నాయి. రెండు గ్రామాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. బంధువులు కూడా. ఒక గ్రామంలో నాలుగు కుటుంబాలు, సమీపంలోనే ఉన్న బోడికుంట్లపల్లిలో ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి. ఏడాది క్రితం తాగునీటి బోరు వేయడానికి అధికారులు ప్రయత్నించగా.. జియాలజిస్టు బోడికుంట్లపల్లి వద్ద పాయింట్ చూపగా అక్కడ బోరు వేశారు. అక్కడి నుంచి సమీపంలోని ఎర్రజేనువారిపల్లికి పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఒక రోజు ఒక ఊరికి ఇంకో రోజు మరో ఊరికి నీరు సరఫరా చేయాలని అధికారులు సూచించారు. అయినా ఈ విషయంలో తొలి నుంచి రెండు ఊర్ల మధ్య మనస్పర్థలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఒకరు పైపులైన్ ధ్వంసం.. మరొకరు దారికి గొయ్యి
బోరు, మోటారు అడవికుంట్లపల్లి ఆధీనంలో ఉండటంతో నీటి సరఫరాకు వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఎర్రజేనువారిపల్లి వాసుల ఆరోపణే కాదు మనసులో మొదటి నుంచి కోపం కూడా. ఈ క్రమంలో నీళ్లు సక్రమంగా వదలలేదని అడవికుంట్లపల్లి వాసులు తమ ఊరి ద్వారా రాకపోకలకు సాగించకుండా ఎర్రజేనువారిపల్లి వాసులు దారికి గొయ్యి తీశారు. దీంతో ఆ ఊరి వారు ఎర్రజేనువారిపల్లికి నీళ్లు వెళ్లకుండా ప్రతీకారంగా పైపులైన్ ధ్వంసం చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. బాధితులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ ఊరికే ప్రత్యేకంగా బోరు వేస్తే ఈ సమస్య రాదని ఎర్రజేనువారిపల్లి వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. ధ్వంసమైన పైపులైన్‌ను శనివారం పునరుద్ధరించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. దారికి తీసిన గొయ్యిని పూడ్చి రాకపోకలకు వీలు కల్పించారు. ఈ విషయమై ఎంపీడీఓ గంగయ్యను వివరణ అడగగా.. తాగునీరు వదిలే విషయమై రెండు ఊర్ల మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి సర్దిచెప్పడం జరిగిందన్నారు. ఎర్రజేనువారిపల్లికి ప్రత్యేకంగా బోరు వేసే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


