కరెంటు తీగల్లో చిక్కుకుని వేటగాడు మృతి | - | Sakshi
Sakshi News home page

కరెంటు తీగల్లో చిక్కుకుని వేటగాడు మృతి

Mar 23 2026 8:27 AM | Updated on Mar 23 2026 8:27 AM

అడవి జంతువుల వేట కోసం పన్నిన ఉచ్చులకు తానే బలి

ప్రమాదంగా మార్చేందుకు

తోటి వేటగాళ్లు కుట్ర

గుర్రంకొండ : అడవి జంతువుల వేట కోసం కొంత మంది వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగెల ఉచ్చులో.. సదరు వేటగాడే చిక్కుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లె సమీప పొలాల్లో జరిగింది. అయితే ఈ మృతికి కారణాన్ని ప్రమాదంగా మార్చేందుకు తోటి వేటగాళ్లు కుట్ర చేయడం గమనార్హం. ఏఎస్‌ఐ బొజ్జానాయక్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పంచాయతీలోని గొల్లపల్లె, ప్యారంపల్లెకు చెందిన పలువురు రాత్రిళ్లు అడవి జంతువుల వేట కోసం ఆయా గ్రామాల సమీపాన కరెంటు తీగెలతో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అడవి జంతువులు వాటిలో చిక్కుకొని బలవుతున్నాయి. ఈ రెండు గ్రామాలు గుర్రంకొండ మండలం తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లె సమీపానికి దగ్గరలోనే ఉన్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ఇరగన్నగారిపల్లె సమీపంలో పొలాలు ఉన్నాయి. దీనికితోడు ఈ ప్రాంతంలోనే రెండు మండలాల సరిహద్దులో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. దీంతో పలువురు వేటగాళ్లు రాత్రిళ్లు కరెంటు తీగెలతో పొలాల వద్ద ఉచ్చులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అడవి జంతువులను వేటాడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన నల్లకాసుల వెంకట రమణ కుమారుడు నల్లకాసుల సుబ్రమణ్యం(25) మరి కొంత మంది ఒక బృందంగా ఏర్పడి గుర్రంకొండ మండల సరిహద్దులో ఉన్న రైతు పొలంలో కరెంటు తీగెలతో ఉచ్చు ఏర్పాటు చేశారు. గత శనివారం రాత్రి తాము ఏర్పాటు చేసిన కరెంటు తీగెల ఉచ్చులో అడవి జంతువులు పడ్డాయో లేదో చూద్దామని వెళ్లారు. అయితే పొరపాటున సుబ్రమణ్యం అదే ఉచ్చులో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక తోటి వేటగాళ్లు సుబ్రమణ్యం మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి మరో పొలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న చోట ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున విద్యుత్‌ ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్ని మృతదేహాన్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌స్క్వాడ్‌తో విచారణ చేపట్టారు. వాల్మీకిపురం పరిసరాల్లో గత కొద్ది రోజులుగా కరెంటు తీగెల ఉచ్చులు ఏర్పాటు చేసి అడవి జంతువులను వేటగాళ్లు వేటాడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్పందించి చర్యలు చేపట్టాల్సిన ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ట్రాన్స్‌కో సిబ్బంది సహాయ సహకారాలతోనే వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతున్నారని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement