మదనపల్లె టౌన్ : బొలేరో ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ముదివేడు పోలీసులు, బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లెకు చెందిన దంపతులు షరీఫ్(30), గులాబ్(25) తమ కుమార్తె షార (7)లతో మదనపల్లెకు రంజాన్ పండుగ సందర్భంగా వచ్చారు. పండుగ చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. స్కూటర్ మార్గంమధ్యలోని కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు 108 సాయంతో వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్య చికిత్సల అనంతరం భార్యభర్తలను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు.
24,25 తేదీల్లో జీఎస్టీ సంస్కరణలపై సెమినార్
కడప ఎడ్యుకేషన్ : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ‘నెక్స్‌జన్ జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం, వికసిత్ భారత్‌పై ప్రభావం (జీఎస్టీ ఏఈహెచ్‌ఎస్–2కె26)’ అనే అంశంపై ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.సరిత తెలిపారు. ఆమె ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రంగంలో వస్తున్న సంస్కరణలపై అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు చర్చించుకోవడం ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు భాగస్వాములై వికసిత్ భారత్ దృష్టితో జీఎస్టీ భవిష్యత్తుపై చర్చల్లో పాల్గొనాలని ఆమె కోరారు.


