బి.కొత్తకోట : స్థానిక చికెన్ సెంటర్‌లో సిలిండర్ నుంచి మంటలు రావడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. శనివారం రాత్రి స్థానిక బీరంగి రోడ్‌లోని ఓ చికెన్ సెంటర్లో నిర్వాహకుడు ఫయాజ్ సిలిండర్ మంటతో కోడిని కాల్చుతున్నాడు. ఆ సమయంలో పైపు దెబ్బతిన్న కారణంగా సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. ఇది పేలిపోతుందన్న భయంతో నిర్వాహకులు మండుతున్న సిలిండర్‌ను లాక్కుంటూ రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనలతో కేకలు వేశారు. సిలిండర్ పేలే ప్రమాదం ఉందని పరుగులు తీశారు. తర్వాత స్థానికులు మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సిలిండర్‌ను రోడ్డుపైకి లాక్కుని రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై రాకపోకలు జరుగుతున్న సమయంలో ఇలా చేయడం మరింత ప్రమాదం అయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గండిమడుగులో మహిళ మృతదేహం లభ్యం
గాలివీడు : మండలంలోని గండిమడుగు వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. నంది మండలానికి చెందిన అనితమ్మ (69) ప్రమాదవశాత్తు గండిమడుగులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ఆస్పత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు.


