రాయచోటి జగదాంబసెంటర్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
ఏడు కేంద్రాల్లో నిర్వహణ: ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సుళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణా), షిల్లాంగ్ (మేఘాలయ)
14 రోజుల పర్యటన
ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజుల పాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళతారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు.
అర్హులు ఎవరంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్‌లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వకృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గ్రైడ్స్ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.
9వ తరగతి విద్యార్థులకు అవకాశం
యువికా–2026 దరఖాస్తులకుఈ నెల 31 తుది గడువు


