రామ దర్శనం.. ముక్తి దాయకం | - | Sakshi
Sakshi News home page

రామ దర్శనం.. ముక్తి దాయకం

Mar 20 2026 8:17 AM | Updated on Mar 20 2026 8:17 AM

23 నుంచి పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు

11 రోజుల పాటు ఉత్సవాలు

ముస్తాబవుతున్న ఆలయం

వాల్మీకిపురం : వాల్మీకిపురంలో వెలసిన పట్టాభిరామ స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతోనే ఈ గ్రామానికి వాల్మీకిపురం అన్న పేరు వచ్చిందని, శ్రీరామచంద్రుడు వాల్మీకం (పుట్ట)లో వెలిసినందున వాల్మీకిపురం అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వెలసిన పట్టాభిరాముడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 23వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి.

ఆలయ ప్రాశస్త్యం

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం వెయ్యేళ్ల క్రితం నిర్మించినట్లు, 13వ శతాబ్దంలోనే ఈ పట్టాభిరామస్వామి దేవాలయాన్ని పునఃనిర్మాణం గావించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. 15వ శతాబ్దంలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వాల్మీకిపురం క్షేత్రాన్ని సందర్శించి ఎన్నో కీర్తనలు రచించారు. ఈ పట్టాభిరామాలయంలో గల మూల విగ్రహాలను మహర్షి జాంబవంతులు వారిచే ఒకే చోట ప్రతిష్ఠించడమైనది. వాల్మీకిపురం పరిసర ప్రాంతంలోని శతశృంగపర్వతాలలో వాల్మీకి మహర్షి తపస్సు చేశారని, ఈ కారణంగా వాల్మీకిపురం క్షేత్రం పురాణ ప్రసిద్ధి గాంచిందని చెబుతున్నారు. భారతదేశంలో ‘అయోధ్య’ తర్వాత శ్రీరామ క్షేత్రాలలో మొదటి స్థానం ‘వాల్మీకిపురమే’ అని ఇక్కడి వాసులు పేర్కొంటున్నారు. ఎంతో ఘనమైన చరిత్ర కల్గిన ఈ ఆలయానికి ఆనాటి రాజులు శ్రీకృష్ణదేవరాయులు, ఛత్రపతి శివాజీ, ఆయన తల్లి జిజియాబాయి, సాళువ నరశింగభూపతిరాయలవారు, ఆంగ్లేయుల అధిపతులలో థామస్‌ మన్రో, సి.పి బ్రౌన్‌, హార్డ్‌హార్డింగ్‌ వంటి వారు, ముస్లిం నవాబులు శ్రీరాముడికి సేవలు అందించి తరించారు.

చింతల రామచంద్రారెడ్డి చొరవతో

టీటీడీ అనుబంధం..

ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుటుంబీకులు వ్యవహరించే వారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఇంతటి చరిత్ర కల్గి పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయాన్ని 1997 ఫిబ్రవరి 23న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చొరవతో తిరుమల–తిరుపతి దేవస్థానానికి అనుబంధ దేవాలయంగా చేర్చడమైనది. ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏటా శ్రీపట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏడాదికి ఒక సారి పవిత్రోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవాలు, ప్రతి మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement