● భయభ్రాంతులైన ప్రజలు
● కేబుల్ ఆపరేటర్‌లదే నిర్లక్ష్యం
రాజంపేట రూరల్ : విద్యుత్ స్తంభం నుంచి ఒక్క సారిగా మంటలు ఎగసి పడటంతో.. చుట్టు పక్కల నివాసం ఉంటున్న ప్రజలు, దుకాణదారులు, ప్రయాణికులు భయభ్రాంతులైన సంఘటన పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక కర్నాటం లాడ్జీ పక్కన ఉన్న విద్యుత్ పోల్ నుంచి మంటలు రావటంతో అవి ఎందుకు వస్తున్నాయో, దానివల్ల ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సమీప ప్రాంతాల ప్రజలు హడలిపోయారు. సమయం పెరిగే కొద్ది మంటలు అధికం కావటంతో స్థానికులు అటు విద్యుత్ శాఖ అధికారులకు ఇటు ఫైర్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. విద్యుత్ పోల్‌కు ఏర్పాటు చేసిన యాంప్లి ప్లేయర్ బాక్స్ ఓవర్ హీట్ అయి పేలిపోవటంతో మంటలు చెలరేగాయని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. మంటలు పెద్దవి అయి పక్కన ఉన్న దుకాణాలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమేనని స్థానికులు వాపొయారు. రానున్నది వేసవి కాలం. ఇదే విధంగా యాంప్లీ ఫ్లేయర్‌లు మండుతూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన కేబుల్ ఆపరేటర్‌లు పట్టణంలోని విద్యుత్ పోల్‌ల చుట్టూ ఇష్టాను సారంగా కేబుల్ వైర్లను చుట్టడంతోపాటు యాంప్లి ఫ్లేయర్‌లను ఏర్పాటు చేయటం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మంటలు చెలరేగటంలో తప్పిదం విద్యుత్ శాఖ అధికారులదా లేక కేబుల్ ఆపరేటర్‌లదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


