● ఉన్నత విద్యా రంగంలో మరో ముందడుగు
● అన్నమాచార్య యూనివర్సిటీ
ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి
రాజంపేట : జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్‌లైడ్ మేనేజ్‌మెంట్ (యూఏఎం)తో రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కదర్చుకున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కేవలం ఐదు విశ్వవిద్యాలయాలతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని యూఏఎం నిర్ణయించిందన్నారు. ఇందులో అన్నమాచార్య యూనివర్సిటీ స్థానం సంపాదించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాదులో ఉగాది సందర్భంగా కుదిరిన ఒప్పందంలో కంప్యూటర్ సైన్స్‌లో గేమ్ డిజైన్, సాఫ్ట్‌వేర్ అనుభవం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేకతలతో టు ప్లస్ టు ట్విన్ డిగ్రీ బ్యాచ్‌లర్ ప్రోగ్రాం ప్రారంభించనున్నామన్నారు. మొదటి రెండు సంవత్సరాలు ఇండియాలోని భాగస్వామ్య సంస్థ ఏయూతో , చివరి రెండు సంవత్సరాలు జర్మనీలో అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం జర్మనీలో మాస్టర్స్ చదివే అవకాశం కల్పిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాల విద్యతోపాటు విదేశీ అనుభవం, మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయన్నారు. జర్మనీ బృందంలో యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్, అంతర్జాతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ టర్న్ వాల్ట్, జర్మనీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ అధినేత రాజ్ వంగపండు, ఇండో యూరోసింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగరాజులు ఉన్నారన్నారు. కాగా ఒప్పంద పత్రాలను ఏయూ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి, యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు, అడ్మిషన్స్ డిప్యూటీ డైరక్టర్ డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


