పెద్దతిప్పసముద్రం : ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక చదువులో బాగానే ఉన్నా పరీక్షలు సరిగా రాస్తానో లేదోనన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. అర్ధాంతరంగా అశువులు బాసిన విషాద సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పరమేశ్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన రామ్మూర్తి, శశికళ దంపతుల కుమార్తె అస్మిత(17) బి.కొత్తకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివేది. బాలిక చదువులో కూడా చురుగ్గా ఉండేది. ఈ నేపథ్యంలో గత నెల 21 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా సమయం దగ్గర పడుతుండటంతో ఇంటి పట్టునే ఉన్న బాలికలో ఆందోళన మొదలైంది. దీంతో బాలిక జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ తరుణంలో గత నెల 22న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా బాలిక ఇంట్లో ఉన్న గడ్డి నివారణ మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పొలం నుంచి ఇంటికి వచ్చిన కన్నవాళ్లు బాలిక నోట్లో నురగ వచ్చి అచేతన స్థితిలో ఉండటాన్ని చూసి హుటాహుటిన బి.కొత్తకోట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని బాఫిస్టు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బుధవారం రాత్రి మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తనకు సమాచారం అందించారని ఎస్‌ఐ తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. బాలిక ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పరీక్షలు బాగా రాయలేననే భయంతో
ఆత్మహత్యాయత్నం


