గుర్రంకొండ : మండలంలోని సరిమడుగు ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నిర్మాణపనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో సుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. పాఠశాల రికార్డులను, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నాభోజనంలొ నాణ్యత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు, ప్రిన్సిపల్ సుమిత్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చెట్టుపైనుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : చింత చెట్టు పైనుంచి పడి కూలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుథవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎర్రాతివారిపల్లెకు చెందిన రాజ శేఖర్(40) స్థానిక బండకాడపల్లెకు చెందిన ఓ రైతుకు చింత కాయలు కోయడానికి కూలి పనులకు వెళ్లాడు. సహచరులతో కలిసి చెట్టెక్కి చింత కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్సఅందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.
రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ
కడప కార్పొరేషన్ : విజయవాడలోని మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ ఆకాడమీ వేదికగా నిర్వహించిన కామ్రెడ్ ఎన్‌వీఎస్ స్పోర్ట్స్ కార్నివాల్–2026లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప జట్టు ప్రతిభ కనబరిచిందని బ్యాంకు రీజనల్ మేనేజర్ ఏ. లక్ష్మి తులసి తెలిపారు. బుధవారం క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు సేవల్లో తీరిక లేకుండా ఉండే అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయన్నారు. బ్యాంకు కార్యకలాపాలతోపాటు క్రీడల్లో కూడా రాణించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో కడప యూనియన్ బ్యాంకు జట్టు మూడో స్థానం సాధించిందన్నారు. అలాగే టగ్ ఆఫ్ వార్‌లో కడప జట్టు రాష్ట్ర చాంపియన్‌గా నిలించినట్లు చెప్పారు. క్రీడా స్ఫూర్తి, పట్టుదలతో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్కూల్ వ్యాన్ ఢీ: వ్యక్తికి తీవ్ర గాయలు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీ గౌతమ్ హైస్కూల్‌కు చెందిన వ్యాన్ మధ్యాహ్నం విద్యార్థులతో కడప రోడ్డు మార్గలో వెళుతోంది. అదే సమయంలో నల్లింగాయపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు తీసుకెళ్లారు.


