చెరువులకు కరువు.. మాఫియాకు లాభం! | - | Sakshi
Sakshi News home page

చెరువులకు కరువు.. మాఫియాకు లాభం!

Mar 18 2026 8:15 AM | Updated on Mar 18 2026 8:15 AM

చెరువులకు కరువు.. మాఫియాకు లాభం! ●ధృతరాష్ట్రుడి పాత్రలో యంత్రాంగం!

అమరావతి: ‘దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు‘ ఉంది రాయచోటి నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితి. ప్రకృతి ప్రసాదించిన జలవనరులను కాపాడాల్సిన పాలకులే.. వాటిని అంగడి సరుకుగా మార్చేశారు. అధికార పార్టీ నేతల కన్ను చెరువులపై పడింది.. ఇంకేముంది జేసీబీలు గర్జిస్తున్నాయి, టిప్పర్లు పరుగులు తీస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సాగుతున్న ఈ ’మట్టి’ భాగోతం వెనుక లక్షలాది రూపాయల ముడుపుల పర్వం నడుస్తోంది.

జీవో ముసుగులో జిమ్మిక్కులు!

రైతులకు మేలు చేయాలనే నెపంతో కూటమి ప్రభుత్వం తెచ్చిన ’ఒండ్రు మట్టి’ జీవో అక్రమార్కులకు వరంగా మారింది. వ్యవసాయ భూములకు తోలాల్సిన మట్టిని, ఇరిగేషన్‌ అధికారుల అండతో రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లకు తరలిస్తున్నారు. క్యూబిక్‌ మీటరుకు రూపాయి చొప్పున నామమాత్రపు చలానా కట్టించి, వేల రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హద్దులు చెరిపేసి.. అక్రమ లేఅవుట్లుగా మార్చేసి!

కడప–చిత్తూరు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెరువులే లక్ష్యంగా ఈ దోపిడీ సాగుతోంది.

లాభం చెరువు: సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ మార్గంలో ఉన్న ఈ చెరువులో గత వారం రోజులుగా జేసీబీలతో భారీ గోతులు తీసి మట్టిని తరలిస్తున్నారు.

దౌలత్‌ ఖాన్‌ చెరువు: జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ చెరువు వెనుక భాగాన్ని ఇప్పటికే ఆక్రమించి, మట్టితో చదును చేసి లేఅవుట్లుగా మారుస్తున్నారు.

ఇతర ప్రాంతాలు: రామాపురం, గాలివీడు, కలకడ, పీలేరు మండలాల సరిహద్దుల్లోని కుంటలు, వాగుల ను వదలకుండా మట్టి మాఫియా చెలరేగుతోంది.

అధికారుల మౌనం.. ప్రజల ఆవేదన!

అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మౌనం వహించడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్‌ గారు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చెరువులను కాపాడాలని, ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబేపల్లి మండలం లాభం చెరువు, దౌలత్‌ ఖాన్‌ చెరువులో మట్టి తవ్వకాలు

రాయచోటిలో అడ్డూఅదుపు లేనిమట్టి దోపిడీ

ఒండ్రు మట్టి ముసుగులో ‘గ్రావెల్‌’ దందా

కూటమి నేతల అండ..అధికారుల ‘మామూళ్ల’ దండ!

నారాయణరెడ్డిపల్లి, దౌలత్‌ ఖాన్‌చెరువుల ఉనికికే ముప్పు

పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది టిప్పర్లు జాతీయ రహదారిపై విచ్చలవిడిగా తిరుగుతున్నా.. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సామాన్య రైతు తన అవసరానికి ఒక్క ట్రాక్టర్‌ మట్టి తోలాలంటే ఆంక్షలు విధించే అధికారులు.. అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న ఈ భారీ దోపిడీని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఆక్రమణదారులు చెరువులను సాగు భూములుగా, ప్లాట్లుగా మార్చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement