నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం

Mar 18 2026 8:15 AM | Updated on Mar 18 2026 8:15 AM

నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం అగ్నిమాపక అధికారులకు రాష్ట్ర స్థాయి సేవా పతకాలు నేడు పారిశ్రామిక విద్యుత్‌ పరిష్కార వేదిక వనజీవి రామయ్యకు ‘గద్దర్‌’ గౌరవం

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కానుంది. మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు కార్యాలయాన్నిబుధవారం కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. మదనపల్లె – బెంగళూరు రహదారిలోని మడికయల శివాలయం వెళ్లే దారిలో ఉన్న రేస్‌ బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రిలు ఈ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, బుధవారం డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రారంభోత్సవంతో జిల్లా పోలీసు పరిపాలన కేంద్రం మదనపల్లె నుండి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుంది.

మదనపల్లె టౌన్‌: విపత్తు సమయాల్లో ప్రాణాలకు తెగించి పోరాడే అగ్నిమాపక శాఖాధికారుల సేవలకు గుర్తింపు లభించింది. అగ్నిప్రమాదాల నివారణలోనూ, ఆపదలో ఉన్న వారిని కాపాడటంలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచిన మదనపల్లె అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ సేవా ఉగాది పురస్కారాలను ప్రకటించింది. మదనపల్లె జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ రెడ్డి విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావానికి గాను ‘ఉత్తమ సేవా పతకం’ లభించింది. అలాగే, మదనపల్లె అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్‌ ఫైర్‌ మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్‌ భాస్కర్‌ రెడ్డి కూడా సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె పరిధిలో జరిగిన పలు అగ్నిప్రమాదాల సమయంలో వీరు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజల ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు.

కడప కార్పొరేషన్‌: ఏపీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం ప్రత్యేక ’సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించనున్నట్లు సంస్థ సిఎండి శివశంకర్‌ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలవారు పారిశ్రామిక విద్యుత్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎస్‌ఈ కార్యాలయాల్లో మొదటి బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పరిష్కారం కాని సమస్యలను, ఈ మూడవ బుధవారం తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో నేరుగా సీఎండీని కలిసి విన్నవించవచ్చని తెలిపారు.

ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ’వనజీవి’ దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన లఘు చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఎంపీటీసీ బూసం రవీంద్రనాథ్‌ నిర్మించిన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేస్తూ ‘గద్దర్‌ అవార్డు’ను ప్రకటించింది. చిత్రసీమలో తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రవీంద్రనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించారు. కోటిన్నర మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందిన రామయ్య బయోగ్రఫీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. ఈనెల 19న ఉగాది పండుగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రొద్దుటూరు గడ్డకు గర్వకారణంగా నిలిచిన రవీంద్రనాథ్‌ను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫోన్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement