నిమ్మనపల్లె: వ్యవసాయంలో లాభాలు గడించాలంటే రైతులు సంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాగు మెళకువలపై అవగాహన పెంచుకోవాలని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ (డీఎం) శ్రీరాములు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నిమ్మనపల్లె, రెడ్డివారిపల్లె రైతు సేవా కేంద్రాలతో పాటు సహకార సేవా సంఘాన్ని తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలు, పంపిణీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి మంజులతో కలిసి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16, 17, 18 మరియు 23, 24, 25 తేదీలలో అగ్రికల్చర్ అసిస్టెంట్లతో కూడిన సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి రైతుల సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. ప్రతి బృందం రోజుకు 30 క్లస్టర్ల (90 గృహాలు) చొప్పున పర్యటించి రైతులకు ’పంచ సూత్రాల’ అమలుపై అవగాహన కల్పిస్తారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా సూచనలు చేస్తారు. ఏపీఏఐఎంఎస్ (APAIMS) యాప్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలను స్వీకరిస్తారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా లాభదాయకమైన పంటల వైపు రైతులు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్క్ ఫెడ్ డీఎం శ్రీరాములు


