మదనపల్లె సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రవేశపెట్టిన ‘బడి కోసం.. డోనర్ యాప్’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సమగ్రశిక్ష అదనపు జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ నున్నా అనూరాధ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో 30 మండలాల విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాతలు ప్రభుత్వ పాఠశాలలకు సులభంగా విరాళాలు అందించేలా విద్యాశాఖ ఈ యాప్‌ను రూపొందించిందని తెలిపారు. గతంలో ప్రధానోపాధ్యాయులు సూచించిన 118 అంశాలను ప్రస్తుతం 82 కాంపోనెంట్లుగా కుదించినట్లు వెల్లడించారు. ప్రతి పాఠశాలలో అవసరమైన వసతులపై హె చ్‌ఎంలు సమగ్ర విశ్లేషణ చేసి, యాప్‌లో వివరాలు న మోదు చేశారో లేదో ఎంఈఓలు పర్యవేక్షించాలని సూ చించారు. సమగ్రశిక్ష ఈఈ సుధాకర్ పాల్గొన్నారు.


