మదనపల్లె: పల్లె నిధులపై పచ్చ నేతలు కన్నేశారు. జిల్లాలోని 411 పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుంది. దాంతో మూడో తేదినుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది. పంచాయతీలకు మండలస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో తమ పెత్తనం చెలాయించడం కోసం టిడిపి నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ మాట వినే అధికారులను నియమించుకుని పంచాయతీల్లో ఉన్న నిధులను అభివృద్ధి పేరుతో అడ్డంగా దోచుకునేందుకు పచ్చ పన్నాగమే పన్నుతున్నారు.
రూ.39 కోట్ల నిధులు
అధికార వర్గాల సమాచారం మేరకు..జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఫిబ్రవరి 28 నాటికి రూ.39.53 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిల్వ ఉన్నాయి. ఇవికాక వృత్తిపన్ను, తలసరి గ్రాంటు నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రస్తుత సర్పంచులు సద్వినియోగం చేసేందుకు అడ్డంకులు ఎదురువుతున్నాయి. కూటమి పాలన కావడంతో స్థానిక నేతల ఒత్తిళ్లతో కార్యదర్శులు, అధికారులు నిధుల వినియోగానికి కొర్రీలు వేస్తూ రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో సాధారణ నిధులతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా ఉన్నాయి. ఈ నిధులను ఏప్రిల్‌లోగా సద్వినియోగం చేయాల్సి ఉంది. ఏప్రిల్ రెండో తేది వరకు సర్పంచుల పాలన ఉంటుంది, మూడో తేది నుంచి ప్రత్యేక పాలన రానుండటంతో ఈ నిధులను అప్పుడే తమకిష్టమైన పనులకు వాడుకొవచ్చన్న ఆశతో టీడీపీ నేతలు ఉంటున్నారు.
ఏడుగురు సర్పంచులు లేరు
జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 411 గ్రామపంచాయతీలుండగా వాటిలో ఏడు పంచాయతీలకు వివిధ కారణాలతో సర్పంచులు లేరు. కలికిరి, వలసపల్లె, రంగసముద్రం, పరికిపాపిరెడ్డిగారిపల్లె, దేవపట్ల, కన్నెమడుగు, పుదిపట్లకు సర్పంచులు లేవు. అలాగే 44 వార్డులకు సభ్యులు లేరు. ఇవి ఇప్పటికి ఖాళీగానే ఉన్నాయి.
వాళ్లకే అవకాశం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ గ్రామపంచాయతీ సర్పంచులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉన్నారు. అప్పుడు పనిచేసిన అధికారులంటే టీడీపీ శ్రేణులకు గిట్టడం లేదు. ఏ చిన్న సమస్య అయినా వారు వాడుతున్న ఊతపదం..ఆ ప్రభుత్వంలో మేం ఇబ్బందిపడ్డాం, ఫలానా అధికారి మాకొద్దు అంటూ చెబుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే గత ప్రభుత్వంపై బురదజల్లి ఫలానా అధికారి అలా చేశారు, ఇలా చేశారంటూ ప్రచారం చేసుకుంటూ అధికారులను బలిపశువులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా మండలస్థాయి అధికారులను నియమించే అధికారం కలెక్టర్లకు అప్పగించడంతో ఇప్పుడు వారి నియామకంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టారు. తమకు ఫలానా అధికారి కావాలి, ఆయనుంటేనే తమ పనులు జరుగుతాయంటూ కావాల్సిన వారినే నియమించుకునేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.
బి.కొత్తకోట రూ.1,24,39,736
చిన్నమండ్యం రూ.3,34,56,042
చౌడేపల్లె రూ.1,10,69,421
గాలివీడు రూ.2,47,69,921
గుర్రంకొండ రూ.66,60,040
కలకడ రూ.35,26,248
కలికిరి రూ.1,74,52,181
కేవిపల్లె రూ.82,30,390
కురబలకోట రూ.72,85,484
లక్కిరెడ్డిపల్లె రూ.2,09,92,201
మదనపల్లె రూ.2,19,74,060
ములకలచెరువు రూ.45,47,948
నిమ్మనపల్లె రూ.36,77,358
పెద్దమండ్యం రూ.1,50,46,872
పెద్దతిప్పసముద్రం రూ.2,13,02,164
పీలేరు రూ.2,35,30,997
పుంగనూరు రూ.3,03,19,504
రామాపురం రూ.1,06,86,308
రామసముద్రం రూ.2,22,49,714
రాయచోటి రూ.1,89,54,377
సంబేపల్లి రూ.61,09,869
సదుం రూ.2,48,75,218
తంబళ్లపల్లె రూ.63,85,154
వాల్మీకిపురం రూ.3,04,67,228
మండలం నిధులు
ఏప్రిల్ 2 తర్వాత ప్రత్యేకాధికారులపాలనలోకి పంచాయతీలు
మాటవినే అధికారులనేఎస్‌ఓలుగా నియామకం
జిల్లాలో సాధారణ నిధులు కాక..రూ.39.53 కోట్ల 15వ ఆర్థిక సంఘనిధులు నిల్వ
ఈ నిధులపై కన్నేసిన ‘తమ్ముళ్లు’
అధిక ఆదాయం, మున్సిపాలిటీ శివారు పంచాయతీలకు ఎస్‌ఓలుగా పనిచేసేందుకు డిమాండ్ పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఎవరిని ఎక్కడ నియమించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తపల్లె, ఈశ్వరమ్మకాలనీ, కురవంక, బసినికొండ, రామాచార్లపల్లె, కొండామర్రిపల్లె, తట్టివారిపల్లె, కోళ్లబైలు, అంకిశెట్టిపల్లె, పొన్నుటిపాళెం, అంగళ్లు, కురబలకోట, నందిరెడ్డిగారిపల్లె, ముదివేడు, కడపక్రాస్, బడికాయలపల్లె, కోటావూరు, గట్టు, ములకలచెరువు, బురకాయలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కందుకూరు, కలిచర్ల, పీలేరు, సదుం, సోమల, చౌడేపల్లె, కలకడ, కలికిరి, వాల్మీకిపురం, చింతపర్తి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండెం..మండల కేంద్రాలు, పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటి శివారు పంచాయతీలకు ఎస్‌ఓలుగా విధులు నిర్వహించేందుకు అసక్తి చూఫుతున్న అధికారులు ఉన్నారు.


