సమస్యకు.. పరిష్కారమేదీ! | - | Sakshi
Sakshi News home page

సమస్యకు.. పరిష్కారమేదీ!

Mar 17 2026 7:36 AM | Updated on Mar 17 2026 7:36 AM

మదనపల్లె రూరల్‌: కలెక్టరేట్‌లో ప్రతి వారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పేరుకుపోతున్నాయి తప్పా.. సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అర్జీదారులు పలుమార్లు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, జీఎస్‌డబ్ల్యూఎస్‌ లక్ష్మీపతి, డ్వామా పీడీ వెంకటరత్నం, సర్వే ఏడీ భరత్‌కుమార్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అన్నమయ్యజిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు 346 అర్జీలను అందజేశారు.

దళితులకు అన్యాయం చేసిన అధికారులు

నిమ్మనపల్లె మండల రెవెన్యూ అధికారులు దళితులభూమికి సంబంధించి ఇతరులకు 1బీ మంజూరుచేసి అన్యాయం చేశారని, వారిపై అట్రాసిటీ యాక్ట్‌ సెక్షన్‌ 4 కింద చర్యలు తీసుకోవాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు డిమాండ్‌ చేశారు. సోమవారం రాచవేటివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన బాధితులతో కలిసి కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. మాచిరెడ్డిగారిపల్లెలో మాల కదిరప్ప కుటుంబసభ్యులకు 4.13 ఎకరాల భూమి ఉంటే, దానికి ఆనుకుని ఇతరులకు చెందిన భూమి ఉంటే, రెవెన్యూ అధికారులు కదిరప్ప సర్వే నెంబర్‌ను సబ్‌డివిజన్‌ చేసినట్లుగా వన్‌బీ నోషనల్‌ ఖాతాలో ఇతరుల పేర్లు ఎక్కించి వన్‌బీ మంజూరు చేశారన్నారు. దీంతో వారు దళితుల భూముల్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా చదునుచేసి సిమెంట్‌ కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారన్నారు. ఈ విషయమై రెండుసార్లు బాధితుడు రెడ్డిప్రసాద్‌ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దళితుల భూమిని అనధికారికంగా ఆక్రమించిన దుండగులపై, భూమిని ఇతరులకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నారిగానిపల్లెలో ఆస్పత్రి నిర్మించాలి....

రామసముద్రం మండలం నారిగానిపల్లెకు మంజూరైన ప్రభుత్వ ఆస్పత్రిని, కమ్మవారిపల్లెలో నిర్మాణం చేస్తున్నారని, తక్షణమే దాన్ని నిలిపేసి తమ గ్రామంలోనే నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. నారిగానిపల్లెలో ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఇచ్చామని, మండల తహసీల్దార్‌ కమ్మవారిపల్లెలో ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు.

దివ్యాంగ పెన్షన్‌ మంజూరు చేయాలి...

అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో కుటుంబపోషణ కష్టమవుతోందని, ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్‌ మంజూరు చేయాలని బి.కొత్తకోట బజారువీధికి చెందిన దినకర్‌ కుమార్‌ అర్జీ సమర్పించారు.

నిలిపివేసిన పెన్షన్‌ ఇప్పించండి....

దివ్యాంగుడైన తనకు గతంలో అందుతున్న దివ్యాంగ పెన్షన్‌ను ప్రస్తుతం అధికారులు నిలిపివేశారని, నడవలేని పరిస్థితిలో ఉన్న తనకు తిరిగి పెన్షన్‌ మంజూరుచేసి ఆదుకోవాలని బి.కొత్తకోట మండలం గొల్లపల్లెకు చెందిన బి.మనోహర్‌ వినతిపత్రం అందజేశారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, దళితుల భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిరసన

ప్రజా సమస్యల పరిష్కార వేదికకుఅర్జీల వెల్లువ

ఫిర్యాదులు స్వీకరించినకలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement