మదనపల్లె రూరల్: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం మదనపల్లె కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి స్థానిక ఆర్యవైశ్యసంఘ ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమరావతిలో శాఖమూరు పార్కులో 58 అడుగుల పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరిస్తున్న కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన పోరాటం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి పునాది వేసిందన్నారు. పీజీఆర్‌ఎస్ హాల్‌లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫొటోగ్యాలరీని కలెక్టర్ నిశాంత్‌కుమా ర్ పరిశీలించారు. అంతకు ముందు పట్టణంలోని జెడ్పీహైస్కూల్ సమీపంలోని కోమటివాని చెరువు ట్యాంక్‌బండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఇన్‌చార్జ్ జేసీ, డీఆర్వో మధుసూధనరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తేజస్విని, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు బింగిపాండు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్


