వేంపల్లె : వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లెలో పాము కాటుతో రైతు పి.మహేందర్ (35) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వివరాలు.. మండలంలోని బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన మహేందర్ తన నిమ్మ తోటలోకి ఈ నెల 11వ తేదీ వెళ్లారు. పాము కాటుకు గురి కావడంతో నాటు వైద్యంతోపాటు పుట్టపర్తిలోని సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బంధువులు చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మహేందర్ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పుష్పవతి, ఇద్దరు కుమారులు శశాంక్, సాత్విక్ లు ఉన్నారు. మృతుని తమ్ముడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


