పూల రైతుకు ‘ధరా’ఘాతం | - | Sakshi
Sakshi News home page

పూల రైతుకు ‘ధరా’ఘాతం

Mar 17 2026 7:36 AM | Updated on Mar 17 2026 7:36 AM

దారుణంగా పతనమైన పూలధరలు

తీవ్రంగా నష్టపోయిన రైతులు

కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్న వైనం

గుర్రంకొండ : ఈ ఏడాది పూలసాగు చేపట్టిన పూల రైతులు నట్టేట మనిగిపోయారు. మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో బంతి, రబ్బరు చామంతి ఇతర పూల ఽరకాల ధరలు రూ. 5 లోపే పలుకుతున్నాయి. జిల్లా మొత్తం రూ.20.01 కోట్ల మేరకు రైతులు నష్టపోయారు. మార్కెట్లకు తీసుకెళ్లినా కొనేవారు లేక పోవడంతో అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు. దీంతో రైతులుతోటల్లోనే పూలు కోయకుండా వదిలేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది పండుగలు, ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వివిధ రకాల పూలతోటల సాగు చేపట్టారు. సాగు చేసిన పూలకు మంచి ధరలు వస్తాయని ఆశించారు. అయితే వీరి ఆశలు అడియాసలయ్యాయి. ధరలు పతనం కావడంతో నష్టపోయారు. నెల రోజులు క్రితం మార్కెట్లో కిలో రూ. 30 నుంచి రూ.40 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం రూ.5లోపే ధరలు పలుకుతుండడంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే అవకాశం లేక రైతులు భారీగా నష్టపోతున్నారు.

ఎకరానికి రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలు సాగుఖర్చు

ఎకరం బంతి పూల సాగుకు రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది.ఎకరం పొలానికి 10 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేల నుంచి రూ. 45 వేల వరకు చెల్లించాలి.ఎరువులు, దుక్కులు,కూలీలు, మందులు, పూలకోతవరకు వచ్చే ఖర్చులు కలుపుకొంటే గరిష్టంగా రూ. 85 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఇదే రబ్బరు బంతిపూల తోటల సాగుకు ఎకరానికి రూ. 1.50లక్షల వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల బంతిపూలు, రబ్బరు బంతి అయితే ఎనిమిది టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బంతిపూల ధర కిలో రూ.4 నుంచి రూ.5వరకు మాత్రమే పలుకుతోంది. ఈలెక్కన కనీసంపెట్టుబడి ఖర్చులు కూడా చేతికందక రైతులు దారుణంగా నష్టపోతున్నారు.

జిల్లాలో రూ.20.01 కోట్ల మేరకు నష్టం

జిల్లాలో ఈ సీజన్‌లో వివిధ రకాల పూలతోటలు సాగు చేసిన రైతులు రూ. 20.01 కోట్లు మేరకు నష్టపోయారు. ఎకరం సాగుకు రకాన్ని బట్టి రూ. 1లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం కోతకొచ్చి అదనుమీదున్న పంటలు 940 ఎకరాల వరకు ఉంది. కనీసం ఒక్క కోత కూడా కోయకుండా పంటలను అలాగే వదిలేసిన రైతులు 80 శాతం మేరకు ఉన్నారు. కొంతమంది పూలు కోసి బెంగుళూరు, చైన్నె వంటి నగరాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లారు. ఆక్కడ కొనేవారు లేక పూల బస్తాలను అలాగే వదిలేసి వస్తున్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో పెట్టుబడి మొత్తం రైతులు నష్టపోయారు. ప్రస్తుతం పూల రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసినా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోయారు. ఉగాది, శ్రీరామనవమితోపాటు జిల్లాలో జరగనున్న జాతర్లపైనే పూల రైతులు ఆశపెట్టుకొని తోటలను కాపాడుకొంటున్నారు.

పండగలపైనే ఆశ పెట్టుకొన్నాం

మార్కెట్లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో రూ. 5లోపే ఉన్నాయి. మార్కెట్‌కు తీసుకెళ్లినా గిట్టుబాటు ధరలు లేవు. దీంతో అదనుమీదున్న పూలు కోసేసి పారేస్తున్నాము. మిగిలినవి కాపాడుకొంటే కనీసం ఉగాది, శ్రీరామనవమి పండుగలకై నా ధరలు పెరుగుతాయనే ఆశతో ఉన్నాం. పండుగ సమయాల్లోనూ ఇవే ధరలు ఉంటే పూర్తిగా నష్టపొతాం.

– సుభధ్రమ్మ, పూలరైతు, వెల్లంవారిపల్లె

పెట్టుబడి కూడా రాలేదు

ఈ ఏడాది బంతిపూలు సాగు చేసి పూర్తిగా మునిగిపోయాం.నెలరోజుల ముందు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా పడిపోయాయి. ఎకరం పొలంలో సాగు చేశాను. అన్ని ఖర్చులు కలుకొంటే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు. పూలసాగు నష్టాలే మిగిల్చింది.

– నాగరాజ, పూలరైతు మొరంపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement