చౌడేపల్లె : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, దాడులు, అక్రమ సంపాదన, అడుగడునా ఆక్రమణలు, అక్రమ కేసులు వివిధ రకాల ప్రభుత్వ వైఫల్యాలను పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. సోమవారం తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసంలో చౌడేపల్లె మండలనుంచి వెళ్లిన నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల వైఎస్సార్‌సీపీలో వివిధ విభాగాల్లో పలువురికి పదువులు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులైన ఏ. రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మండల పార్టీ అఽధ్యక్షుడు నాగభూషణరెడ్డి, వెంకటరమణలతోపాటు పలువురు నేతలు పెద్దిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నేతలకు మరింత బాధ్యతలు రెట్టింపు అయ్యాయని, గుర్తుచేశారు. కష్టపడి పార్టీ కోసంపనిచేస్తున్న నేతలు, కార్యకర్తలసేవలకు తగిన గుర్తింపునిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం తీసుకొనే చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజల్లో మద్దత్తు తీసుకురావాలని, ఇందుకోసం ప్రతికార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకరమణ, లడ్డూరమణ నాయకులు బ్రహ్మానందరెడ్డి, షంషీర్, నరేష్, గోపి, రామకృష్ణ, రెడ్డప్పరెడ్డి, బాబురెడ్డి, వెంకటరెడ్డి, అల్తాఫ్, రాజారెడ్డి,సోని, యశోద,గంగాధర్,గంగిరెడ్డి, మంజునాథ్,ఆనందాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


