ముద్దనూరు : మండల కేంద్రంలోని యానాదికాలనీకి చెందిన సుశీల(34) అనే వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఏఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి సమాచారం మేరకు వివరాలు..సుశీల తన భర్త నితిన్‌తో కలిసి డీఎన్‌పల్లె సమీపంలోని ఓ తోటలో కాపలాకూలీలుగా పనిచేస్తున్నారు.గత కొంత కాలంనుంచి కడపలో ఉన్న సుశీల తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ఆమె సోదరితో సమస్య నెలకొంది.ఈనేపథ్యంలో శనివారం రాత్రి సుశీల ఆమె భర్తతో కలసి తోట వద్ద తన తండ్రి ఆస్తివిషయంపై చర్చించి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
నియామకం
కడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతాపార్టీకి బత్తల పవన్ కుమార్ అందించిన సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కడప జిల్లా చైర్మన్‌గా నియమించింది. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలియజేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామం ఎంపీపీ స్కూల్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ హారిక మాట్లాడుతూ భాకరాపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా అతన్ని గుర్తుపడితే 9121100581, 9121100584 నంబర్లకు సమాచారం తెలపాలని ఎస్‌ఐ తెలియజేశారు.
అడవికి నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
కలసపాడు : మండలంలోని ముసల్‌రెడ్డిపల్లె గ్రామం వద్ద ఉన్న అడవికి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి చిన్నవెంకటరెడ్డికి చెందిన సర్వే నంబర్ 105 లోని మామిడి తోటలోకి వ్యాపించాయి. గమనించిన రైతు స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆరు సంవత్సరాల వయస్సు గల 50 మామిడిచెట్లు, మూడు సంవత్సరాలు వయస్సు గల 80 శ్రీగంధం చెట్లు కాలిపోయాయి.
కేసుల పరిష్కారంలో వైఎస్సార్ కడప జిల్లాకు ప్రథమ స్థానం
కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఈనెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,03,591 కేసులు పరిష్కారం చేసి లబ్ధిదారులకు రూ.24,01,72,158 కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా 103343 క్రిమినల్ కేసులు, 248 సివిల్ కేసులు, 53 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలియజేశారు. కడపలో 11720 కేసులు, పొద్దుటూరు, మైదుకూరులో 15303, రాజంపేటలో7116, రాయచోటిలో 9635, బద్వేల్‌లో 8105, జమ్మలమడుగులో 9700, సిద్ధవటంలో 5070, రైల్వేకోడూరులో 6117, పులివెందులలో 8394, నందలూరులో 6055, లక్కిరెడ్డిపల్లిలో 10093, కమలాపురంలో 6283 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు అధికారులకు, కృతజ్ఞతలను తెలియజేశారు. కేసుల పరిష్కారంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు.


