● హాజరుకాని ఎమ్మెల్యేలు, అధికారులు
● మదనపల్లెలో మొక్కుబడిగా నిర్వహణ
● ముస్లింలకు అవమానం
మదనపల్లె : ముస్లింల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆదివారం మదనపల్లెలో ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు తేటతెల్లం చేసింది. దీనిపై మదనపల్లె ముస్లిం వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమం అంటూ మొక్కుబడిగా నిర్వహించి, చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇఫ్తార్ పేరుతో అవమానించడం తగదంటూ నిలదీస్తున్నారు.
ఒక్క అధికారి లేరు
ప్రభుత్వం అధికారికంగా ప్రతి జిల్లాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లెలోని ఓ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితి పూర్తిగా లేదు. చిన్నస్థాయి ఉద్యోగి కూడా హాజరు కాలేదు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా కొందరు టీడీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమంగా మారిపోయింది. ఇఫ్తార్ విందుకు జిల్లాస్థాయిలో ముఖ్య నాయకులను, ప్రజా ప్రతినిధులను, ముస్లిం వర్గానికి చెందిన మత పెద్దలను అధికారులే ఆహ్వానించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ జరగలేదు. కనీసం ప్రభుత్వ కార్యక్రమం అన్న విషయాన్ని మరిచిపోయారు. ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
ఒక్క ఎమ్మెల్యేనే..
ప్రభుత్వ ఇఫ్తార్ విందు అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు ఎస్‌ఏ.మస్తాన్, పౌరసరాఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ తాజ్.. ఇలా కొందరు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఆదివారం జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లెకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఆయన కూడా హాజరు కాలేదు. అధికారికంగా ఆయనను ఆహ్వానించారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలను ఆహ్వానించారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాస్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందు సాదాసీదాగా ముగిసింది. అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.


