కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ టీచర్స్ ఆసోసియేషన్ నూతన కార్యాలయం వేదిక కావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడపలోని నాగరాజుపేట స్మిత్ రోడ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ. రామచంద్రారెడ్డి, కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఐఆర్, నాలుగు డీఏలను పెడింగ్‌లో పెట్టారన్నారు. పీఆరీసీ నూతన కమిటీ చైర్మన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ఏపీ వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్‌నాథరెడి, ప్రధాన కార్యదర్శి కిరణ్, వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు
రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాలు తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి పాలు, పెరుగు, తేనే, పంచదార, టెంకాయ నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు శుద్ధి చేశారు.అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు. భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగరసంకీర్తనలో పాల్గొన్నారు.
కడపలో వైఎస్సార్‌టీఏ కార్యాలయం ప్రారంభం


