లక్కిరెడ్డిపల్లి : జీవితంపై విరక్తి చెంది వంటేరు ప్రసాదు (26) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గోల్గొండ శోభ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరురాజుగారిపల్లికి చెందిన వంటేరు వ్రసాద్ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పట్లో మృతుడిపై కేసు నమోదైంది. ఈ కేసుపై కొన్ని రోజులుగా కోర్టుకు వాయిదాలు తిరుగుతున్నాడు. గురువారం లక్కిరెడ్డిపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి పందేళపల్లి సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో విషద్రావణం తాగి శుక్రవారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం పశువుల కాపరులు ఆ మార్గంలో వెళ్తుండగా వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


