మదనపల్లెటౌన్: మహిళ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లె తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ శనివారం మీడియాకు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కోళ్లబైలు గ్రామం, నీరుగట్టువారిపల్లె వద్ద ఉన్న వెంకటేశ్వరపురానికి చెందిన షేక్ మహమ్మద్ రవూఫ్ భార్య మెహతాజ్ బేగం పిల్లలకు తినుబండారాలు తీసుకురావడానికి అంగడికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో రవూఫ్ బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో చేసిది లేక స్థానిక తాలూక పోలీసులను ఆశ్రయించి శనివారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.
పిచ్చికుక్క దాడి:ఐదుగురికి గాయాలు
చౌడేపల్లె : మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలో శనివారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పది ఆవుదూడలను ఇష్టానుసారంగా కరిచింది. చంద్రమౌళి, కత్తి కృష్ణారెడ్డి ,బీహార్‌బాషాలతో పాటు మరో ఇద్దరిని కరిచింది. అలాగే వెంకటరమణ, వసంతమ్మ, చంద్రమౌళిలకు తోపాటు మరో ఏడుగురికి చెందిన ఆవుదూడలను కరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు.
నియామకం
సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శిగా రాయచోటికి చెందిన వాయలపాటి ఆనంద్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రుక్మిణమ్మ
చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రుక్మిణమ్మ నియమితులయ్యారు. ఆమేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది.


