మదనపల్లెటౌన్ : బి.కొత్తకోట మండలంలో కారు ఢీకొని చెక్కిలాల వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట పట్టణానికి చెందిన శ్రీరాములు(52), ఇంట్లో తయారు చేసిన చెక్కిలాలు, నిప్పట్లు, మురుకులను పల్లెలకు తీసుకెళ్లి రోజూ విక్రయించి వచ్చేవాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే శనివారం శ్రీరాములు బైకులో చెక్కిలాలను తీసుకుని కాండ్లమడుగు క్రాస్ వద్దకు వ్యాపారం నిమిత్తం వస్తుండగా, కోళ్ల ఫారం వద్దకు రాగానే కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్‌చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు.


