● ఢీకొన్న కారు, బొలేరో వాహనం
● ఇద్దరికి తీవ్ర గాయాలు
● మృతులు అనంతపురం జిల్లా వాసులు
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన ఆదిలక్ష్మికి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద విరూపాక్షిపురంలో పక్షవాతానికి మందు తినిపించడం కోసం డ్రైవర్ ఖాదర్‌వలి, కుటుంబ సభ్యులు మురళి, వనజాక్షి ఒక కారులో ప్రయాణమయ్యారు. ములకలచెరువు మండలం గొడ్డావులకోట వద్దకు రాగానే టమాట క్రేట్లతో ఎదురుగా వస్తున్న బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఖాదర్‌వలి(48), ఆదిలక్ష్మి(62) సంఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. బొలేరో డ్రైవర్ బాలాజీ నాయక్(35), మురళి(45), వనజాక్షి(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్లే ప్రయాణికులు 108, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె హాస్పిటల్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనజాక్షి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్ తెలిపారు.
మృతి చెందిన ఖాదర్‌వలి, ఆదిలక్ష్మి


