మదనపల్లె టౌన్ : మదనపల్లె– పుంగనూరు రోడ్డులోని బసినికొండలో శుక్రవారం ఓ లారీ బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాద ఘటనపై స్థానిక అగ్నిమాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపిన వివరాలు.. బసినికొండలో స్థానికంగా ఉండే బాబ్ జాన్ కొత్త, పాత లారీలకు బాడీ బిల్డింగ్ పనులు సిబ్బందితో చేయిస్తారు. ఈ క్రమంలో షెడ్డుకు సమీపంలో ఉన్న గడ్డి మైదానానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలుతూ వచ్చి, బాబ్ జాన్ లారీ బాడి బిల్డింగ్ షెడ్డుకు మంటలు వ్యాపించాయి. సిబ్బంది తేరుకుని మంటలు అదుపు చేసేలోపే షెడ్డులోని కొయ్యలు మండుకున్నాయి. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. షెడ్డులో ఉన్న దాదాపు రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరగకుండా అధికారులు సకాలంలో కాపాడారు. అలాగే పక్కన ఉన్న లారీలకు, షెడ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశామని శివప్ప తెలిపారు.


