సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్, హాజరైన విద్యార్థులు అధ్యాపకులు
కడప ఎడ్యుకేషన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆకలింపు చేసుకోవడంతోపాటు సాంకేతికత తోడుగా చేసుకొని నడిస్తే యువత అద్భుతాలు సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వ్యవస్థాపకులు, డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం, కళాశాల 21వ వార్షికోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ గ్రంథాలయ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నేడు చాలా మంది విద్యార్థులు గ్రూప్స్, సివిల్స్ అనే ఉన్మాదంలో పడి లక్షల రూపాయలతోపాటు సమయాన్ని వృథా చేసుకుంటున్నారని దాని నుంచి బయటకు రావాలని సూచించారు. నిజంగా ప్రజలకు సేవలు అందించాలనే తపన, అసక్తి ఉంటేనే గట్టిగా ప్రయత్నించాలని పేర్కొన్నారు. మీ కళ్ల ముందు అద్భుతాలు జరుగుతున్నాయని.. మీ భవిష్యత్తు అందంగా ఉంటుందని అయితే దానిలో పాలుపంచుకొనే ధైర్యం ముందుచూపు మీకు ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా మారుతోందనే విషయం గుర్తించి అందుకు అనుగుణంగా సంసిద్ధులు కావాలన్నారు. మనకు తెలియని కొత్త కొత్త వృత్తులు మన ముందుకు రాబోతున్నాయని అది రోబోటిక్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదే కాకుండా మరేదైనా ఉండవచ్చన్నారు. నేటి యువత ఒక అద్భుత యుగంలో ఉన్నారని గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకాశాల్లేవన్నారు. యువత సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇరవై ఏళ్ల కిందట కడప నగరాన్ని చూసినపుడు ఒక మామూలుగా ఉండేదని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల కడపకు నిధుల వరద పారిందని.. ఇక్కడికి పెట్టుబడులు వచ్చి వేగంగా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. గౌరవ అతిథి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ డా. జయప్రకాష్ నారాయణ్ నడుస్తున్న గ్రంథాలయమని, ఎంతోమందికి ఆయన స్ఫూర్తిప్రదాత అన్నారు. ఇరవై సంవత్సరాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మీరంతా మరో ఇరవై ఏళ్లలో ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ టి.శ్రీనివాన్ కళాశాల ప్రగతి నివేదించారు. ప్రొద్దుటూరు వైవీయూ వైఎస్సార్ ఇంజినీరింగు కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ జి.జయచంద్రారెడద్ది కళాశాల ప్రగతిని వివరించారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పద్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, ఆచార్య చంద్రమతి శంకర్ పాల్గొనగా ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి సభా సమన్వయం చేశారు. డాక్టర్ సునీత ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, స్కాలర్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫౌండేషన్ డే కళాశాల ఉత్సవం సందర్భంగా బోధన బోధ నేతర సిబ్బందికి నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు.
కొత్త విషయాలను నేర్చుకుని
అన్వయించుకునే వారికే అవకాశాలు
మహానేత వైఎస్సార్‌తోనే
కడప వేగంగా అభివృద్ధి
ఏపీ ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత
ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్
ఎన్. జయప్రకాష్ నారాయణ్


