– డీఈఓ డాక్టర్ కె సుబ్రమణ్యం
రాయచోటి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికోసం టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె సుబ్రమణ్యం తెలిపారు. రెండో విడతలో ఈనెల 6వ తేది నుంచి డైట్‌లో అధ్యాపకులు నిర్వహిస్తున్న ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం వారు పరిశీలించారు. తరగతి గది బోధనను విద్యార్థి కేంద్రీకృతంగా మార్చేందుకు టీచ్ టూల్ ఉపయోగకరమన్నారు. బోధనా ప్రక్రియలో తరగతి గది పరిశీలన, పర్యవేక్షణ కీలకమని డీఈఓ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేస్తే విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ క్యాక్రమంలో కోర్సు కో–ఆర్డినేటర్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు.
వైవీయూ స్నాతకోత్సవం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోనా!
కడప ఎడ్యుకేషన్: విశ్వవిద్యాలయ చదువులు ముగించుకొని విశ్వవిద్యాలయంలోనే పట్టా పుచ్చుకోవడం విద్యార్థుల కల అని.. ఆ కలను దూరం చేస్తూ స్నాతకోత్సవాన్ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించటం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.తవ్వా వెంకటయ్య పేర్కొన్నారు. ఈ నెల 13న అలంఖాన్ పల్లె బైపాస్ రోడ్డులో ఉన్న డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరగబోతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. ఒక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విశ్వవిద్యాలయంలో కాకుండా ఫంక్షన్ హాల్లో జరపడమేమిటని వెంకటయ్య ప్రశ్నించారు. ఇంతవరకు యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు.


