ప్రేమ పెళ్లి చేసుకున్నోడు వదిలేశాడని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కట్టుకున్నోడు మోసం చేసి వదిలేశాడు. పుట్టినింటోళ్లు, మెట్టి నింటోళ్లు పట్టించుకోక పోవడంతో.. అద్దె ఇంటిలో ఉంటున్న ఆ యువతి పస్తులతో గడపలేక బతుకు దుర్భరంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. మంగళవారం మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు.. మదనపల్లె చంద్రా కాలనీలో ఉంటున్న అములు(20) ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పట్టణంలో ఉండే ఓ స్కూటర్ మెకానిక్ హేమంత్ ప్రేమలో పడింది. ఏడాది కూడా తిరగకనే ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్లు ఒక అద్దె ఇంటిలో ఉంటూ జీవనం గడిపారు. ఇంతలోనే ప్రియురాలు పై మోజు తీరిపోవడంతో హేమంత్ పది రోజుల క్రితం ఫోన్ స్విఛ్చాప్ చేసుకుని ఉడాయించాడు. భర్త కోసం ఎదురు చూసి, పస్తులతో ఉండలేక, జరిగిన విషయం అత్త మామలతో పాటు పుట్టినింట్లో చెప్పింది. వాళ్లు అములు ను ఛీదరించుకున్నారు. దీంతో ఆ యువతి చేసేది లేక స్థానిక తాలూక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వారం రోజులుగా స్టేషన్ చుట్టు తిరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆమె తాను తీవ్రంగా మోసపోయానని భావించింది. స్థానికంగా లభించిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్సల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇప్పటికై నా పోలీసులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని
బాధితురాలు ఆవేదన


