టీడీపీలో పాలకమండలి మంటలు!
● 3 గంటలు ఆలస్యంగా ఎమ్మెల్యే రాక
● వెనుదిరిగిన టీడీపీ, బీజేపీ సీనియర్లు
మదనపల్లె : మదనపల్లె యోగభోగేశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకం మంటలు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే వర్గీయులకు ఈ కమిటిలో స్థానం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రమాణస్వీకారానికి ఆహ్వనించిన సమయానికి ఎమ్మెల్యే రాకపోవడంతో టీడీపీ, బీజేపీ సీనియర్లు వెనుదిరిగి వెళ్లారు. శనివారం రాత్రి నుంచి సోమవారం దాకా జరిగిన నాటకీయ పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈనెల ఆరున ఆలయానికి కె.వెంకటరమణ, సి.భవాని, ఎం.నాగరమ్య, డి.మల్లికారాణి, సి.మల్లిక, కే.ప్రకాష్‌నాయుడు, పి.వరప్రసాద్, ఎస్.లక్ష్మినరసింహ మూర్తి, బి.శివకుమార్‌లను పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్తర్వు రావడమే ఆలస్యం అన్నట్టుగా ఎమ్మెల్యేకు, పార్టీ వర్గాలకు కనీస సమాచారం ఇవ్వకుండా శనివారం రాత్రే బాధ్యతల స్వీకరించడం, ఆదివారం ఎమ్మెల్యేను కలిసిన కమిటీ సభ్యులు విషయం చెప్పడంతో అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యేకు చెప్పకుండా బాధ్యతలు తీసుకోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు యోగభోగేశ్వస్వామి ఆలయంలో పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను ఆహ్వనించారు. ఇలాగే టీడీపీ, బీజేపీ సీనియర్లను ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మరో మాజీ ఎమ్మెల్యే రాటకోండ శోభ భర్త, సీనియర్ టిడిపినేత బాబురెడ్డి, టిడిపి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్‌ఖాన్, బిజెపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, యల్లంపల్లి ప్రశాంత్, టిడిపినేతలు రాటకొంట గుర్రప్పనాయుడు, ఎన్‌సి.నందకుమార్, మల్లికార్జున నాయుడు, పట్టణ, రూరల్ అధ్యక్షులు అరుణ్‌తేజ్, శ్రీనివాసులు తదితర నేతలు హజరయ్యారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడం, కార్యక్రమం ప్రారంభించకపోవడంతో వీరంతా అసహనంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఎమ్మెల్యే రావడంతో పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందితో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగించారు.


